ఆదర్శంగా హరితహారం

5 Feb, 2019 02:53 IST|Sakshi

యూపీ అధికారులబృందం ప్రశంసలు

రాష్ట్రంలో హరితహారంపై అధ్యయనానికి రాక

నేడు పలు జిల్లాల్లోక్షేత్ర స్థాయి పర్యటన

సాక్షి, హైదరాబాద్‌: హరితహారం పథకం దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శం అని ఉత్తరప్రదేశ్‌ అధికారుల బృందం ప్రశంసించింది. తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం పెంపు కోసం చేపట్టిన హరితహారం పథకంపై అధ్యయనం చేసేందుకు యూపీ అధికారులు ఇక్కడికి వచ్చారు. కోట్లాది మొక్కలు నాటాలనే సీఎం కేసీయార్‌ సంకల్పమే అత్యంత ధైర్యమైన నిర్ణయమని వారు ప్రశంసించారు. యూపీ గ్రీన్‌ ప్రాజెక్ట్‌ మిషన్‌ డైరెక్టర్, గోరఖ్‌పూర్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌గా ఉన్న బివాస్‌ రంజన్‌ నేతృత్వంలో అధికారుల బృందం సోమవారం అరణ్యభవన్‌లో రాష్ట్ర అటవీశాఖ అధికారులతో సమావేశమైంది.

హరితహారం అమలు తీరు పూర్తిగా అధ్యయనం చేసి తమ రాష్ట్రంలో కూడా గ్రీన్‌ ప్రాజెక్టును సమర్థంగా అమలు చేయనున్నట్లు బివాస్‌ రంజన్‌ వెల్లడించారు. ఈ ఏడాది వర్షాకాలంలో యూపీ జనాభాకు (22 కోట్ల మంది) సమానంగా, ఒక్కొక్కరు ఒక్కో మొక్క చొప్పున 22 కోట్ల మొక్కలు నాటాలనే నిర్ణయాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీసుకున్నారని తెలిపారు. ఇందుకోసం ఎలా సన్నద్ధం కావాలన్న ప్రణాళికలో భాగంగా తెలంగాణ పర్యటనకు వచ్చినట్లు చెప్పారు.

మా సీఎంను కోరతాం..
హరితహారాన్ని చూసేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను తెలంగాణలో పర్యటించాల్సిగా కోరతామని యూపీ అధికారులు తెలిపారు. పచ్చదనం గ్రామ అభివృద్ధిలో తప్పనిసరి అంశంగా చేరుస్తూ కొత్తగా తెచ్చిన పంచాయతీ రాజ్‌ చట్టాన్ని కూడా వారు ప్రశంసించారు. భారీ సంఖ్యలో నర్సరీల ఏర్పాటు, ఉపాధి హామీ నిధుల అనుసంధానం, మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం ప్రజలు, విద్యార్థుల భాగస్వామ్యంపై తెలంగాణ అదనపు అటవీ సంరక్షణ అధికారి ఆర్‌.ఎం.డోబ్రియల్‌ యూపీ అధికారులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అడవుల సంరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పీసీసీఎఫ్‌ పీకే ఝా తెలిపారు. అటవీ సంరక్షణ, హరితహారం అమలుపై గజ్వేల్, సిద్దిపేట, మెదక్‌ ప్రాంతాల్లో యూపీ అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్‌ (విజిలెన్స్‌) రఘువీర్, అదనపు పీసీసీఎఫ్‌ లోకేశ్‌ జైస్వాల్, స్వర్గం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు