అ‘పరిష్కృతి’..!

10 Sep, 2019 11:51 IST|Sakshi
కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వినతులు అందించేందుకు క్యూలో నిల్చున్న ఫిర్యాదుదారులు

సాక్షి, కొత్తగూడెం: సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌ కార్యక్రమం అనుకున్న మేర లక్ష్యం సాధించడం లేదు. ఇక్కడికొచ్చే సమస్యల్లో కొన్ని పరిష్కారం అవుతున్నా.. భూసంబంధ సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి. ప్రతి గ్రీవెన్స్‌కు ఆయా విభాగాల ప్రధాన అధికారులను కలెక్టర్‌ పిలిపించి తక్షణమే సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ప్రయత్నం అంతగా ఫలితాలనివ్వడం లేదు. సోమవారం ‘సాక్షి’ రెండు భూ ఆక్రమణల కేసులను పరిశీలించింది. ఇ.పుష్పకుమారి అనే ఓ మాజీ నక్సలైట్‌కు పునరావాసం కింద ఇచ్చిన మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని కొందరు ఆక్రమిస్తున్నారు. ఈ విషయమై ఆమె ప్రతి అధికారి చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. చివరకు సోమవారం.. ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలని కలెక్టరేట్‌ ఏఓకు జాయింట్‌ కలెక్టర్‌ సూచించారు.

కాగా సదరు ఏఓ బాధిత మహిళతో ‘నీకు ఈ స్థలం ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, తహసీల్దారుకు చెప్పి మరోచోట ఇప్పిస్తా’ అనడంతో పాటు భూముల ధరలు పెరుగుతండడంతో ఇలా ఆక్రమణలు జరగడం సహజమేనని సెలవిచ్చారు. చివరకు సమస్యను సశేషంగానే ఉంచారు. దీంతో బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే మళ్లీ ఉద్యమంలోకి వెళ్లాలనే ఆలోచన వస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక కొత్తగూడెం జిల్లాకేంద్రం నడిబొడ్డులో కొదురుపాక మీనాకు మారి అనే ఓ మహిళా న్యాయవాదికి వంశపారంపర్యంగా వచ్చిన ఇంటిని మున్సిపల్‌ అధికారులు ఆమెకు తెలియకుండానే మరొకరి పేరుపై మార్చారు. స్థానిక నాయకులు కొందరు ఆక్రమణదారులకు మద్దతు తెలుపుతుండడంతో వారు తనపై అట్రాసిటీ కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారని న్యాయవాది వాపోయారు. 

పునరావాసం కింద ఇచ్చిన స్థలాన్ని కబ్జా చేస్తున్నారు 
జనశక్తి దళంలో పనిచేస్తూ 2000 సంవత్సరంలో పోలీసుల ఎదుట లొంగిపోయాను. 2004లో తిరిగి జనశక్తి దళంలో చేరాను. 2006లో మళ్లీ లొంగిపోయాను. ప్రభుత్వం ఇచ్చే పునరావాసం కింద నాకు 2010లో సమితి సింగారం పంచాయతీ రాజీవ్‌గాంధీ నగర్‌లో మూడు సెంట్ల స్థలాన్ని అధికారులు కేటాయించారు. అయితే ఆర్థిక స్తోమత లేక ఇప్పటికీ ఇల్లు నిర్మించుకోలేదు.  స్థానికులైన కమ్మంపాటి శ్రీను, రేగళ్ల శంకర్, కె.సాయిపద్మ, ఎం.పద్మ, ఎస్‌.ఎ.కోటి, యెదరి రామకృష్ణ ఈ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని గత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దృష్టికి కూడా తీసుకెళ్లా.

అదే సమయంలో అప్పటి కాంగ్రెస్‌ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే రేగా కాంతారావుకు కూడా వివరించా. అయినా ఇప్పటికీ న్యాయం జరగలేదు. చివరికి హైదరాబాద్‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ వద్దకు కూడా వెళ్లి  మొరపెట్టుకోగా ప్రస్తుత కలెక్టర్‌కు లేఖ పంపారు. దీనిని కూడా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఇచ్చిన వినతిపత్రంలో జతచేశా. భర్త మరణించి అనాథగా ఉన్న గిరిజనురాలినైన నాకు ఈ స్థలాన్ని న్యాయబద్ధంగా ఇప్పించాలని కోరుతున్నా. 
– పుష్పకుమారి, సమితి సింగారం, మణుగూరు మండలం.

నాకు తెలియకుండా మ్యుటేషన్‌ చేశారు 
కొత్తగూడెం మున్సిపాలిటీలోని గాజులరాజం బస్తీలో 4–2–144 నంబర్‌లో నాకు ఇల్లు ఉంది. మా అమ్మ సముద్రాల భారతి ద్వారా వంశపారంపర్యంగా ఆ ఇల్లు లభించింది. నేను 2015 నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నా. ఈ ఇల్లు నివాసయోగ్యంగా లేక ఎవరికీ అద్దెకు కూడా ఇవ్వలేదు. ఇటీవల జీఓ రావడంతో పట్టా కోసం దరఖాస్తు చేసుకునేందుకు కొత్తగూడెం వచ్చాను. అయితే నా పేరుపై ఉన్న ఇంటిని 2013లో నాకు తెలియకుండా రెడ్డి కృష్ణకుమారి పేరుతో ముటేషన్‌ చేశారని తెలిసి ఆశ్చర్యపోయాను.

ఈ విషయమై మున్సిపల్‌ అధికారులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఆక్రమించుకున్న వారిని అడిగితే..నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఎక్కువగా మాట్లాతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. 2009 నుంచి 2015 మొదటి అర్థసంవత్సరం వరకు ఇంటి పన్ను కూడా చెల్లించా. నా ఇంటిపై సర్వహక్కులు కల్పించి న్యాయం చేయాలని కలెక్టర్‌కు విన్నవించుకున్నాను.
– కొదురుపాక మీనాకుమారి, కొత్తగూడెం మున్సిపాలిటీ   

మరిన్ని వార్తలు