వరుడు పరారీ.. తాళి కట్టిన మరో యువకుడు

30 Dec, 2018 01:30 IST|Sakshi

తాళి కట్టిన మరో యువకుడు 

హుస్నాబాద్‌ రూరల్‌: ఉదయం 11 గంటలకు వివాహ ముహూర్తం.. వధువు బంధువులు వరుడిని తీసుకొచ్చేందుకు అబ్బాయి ఊరు వెళ్లారు. అబ్బాయిని తీసుకుని పెళ్లి మండపానికి వచ్చే క్రమంలో.. వరుడు వాహనం దిగి పారిపోయాడు. దీంతో ఏం చేయాలనే అయోమయంలో పడ్డ వధువు తల్లిదండ్రులు.. అనుకోకుండా ఓ యువకుడి నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు. పెళ్లి ఆగిన క్రమంలో సదరు యువకుడు ముందుకొచ్చి వధువు మెడలో తాళి కట్టాడు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. 

పొట్లపల్లి గ్రామానికి చెందిన కోల రాజలింగు, భూలక్ష్మి దంపతులు తమ కుమార్తెను మేనత్త కొడుకు, చిగురుమామిడి మండలం చినముల్కనూర్‌కు చెందిన పందిపెల్లి శ్రీనివాస్‌కు ఇచ్చి పెళ్లి చేసేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. అయితే శ్రీనివాస్‌ నుస్తులాపూర్‌కు చెందిన మరో యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇది తెలిసే తమ కుమార్తెను మొదట ముల్కనూర్‌కు చెందిన పందిపెల్లి రమేశ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు వధువు తల్లిదండ్రులు నిర్ణయించారు.

అయితే, శ్రీనివాస్‌ తల్లి అడ్డుపడి తన కొడుకుకు ఇచ్చి పెళ్లి చేయాలని పట్టుబట్టడంతో పెళ్లి కుదుర్చుకున్నారు. కానీ పెళ్లిపీటల పైకి వచ్చే సమయంలో శ్రీనివాస్‌ పరారు కావడంతో మొదట నిర్ణయించిన వరుడైన రమేశ్‌ తల్లిదండ్రులతో మాట్లాడి.. అదే వేదికపై పెళ్లి కానిచ్చారు. పందిపెల్లి రమేశ్‌ పెద్ద మనసుతో ముందుకు వచ్చి వధువు మెడలో తాళికట్టి, అమ్మాయి తల్లిదండ్రుల ముఖంలో సంతోషం నింపడంతో బంధువులు ప్రశంసలతో ముంచెత్తారు.

మరిన్ని వార్తలు