బోరు భోరుగా..

9 May, 2019 08:35 IST|Sakshi

గ్రేటర్‌లో జలసిరి ఆవిరి భారీగా తగ్గుతున్న భూగర్భ జలాలు

పలు మండలాల్లో సరాసరిన 2 నుంచి 5 మీటర్లు లోతుకు...  

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో భూగర్భ జలాలు అథఃపాతాళంలోకి చేరుతున్నాయి. విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం, నీటి వినియోగం అనూహ్యంగా పెరగడంతో పాతాళగంగ అడుగంటుతోంది. గతేడాదితో పోలిస్తే పలు మండలాల్లో సరాసరిన 2 నుంచి 5 మీటర్ల మేర భూగర్భజలమట్టాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే సుమారు 40 శాతం బోరుబావులు నీళ్లు లేక వట్టిపోయాయి. మరోవైపు శివారు ప్రాంతాల్లో గేటెడ్‌ కమ్యూనిటీలు, స్వతంత్ర గృహాలు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం ఊపందుకోవడం, కాంక్రీటు మహారణ్యాలు విస్తరిస్తున్న కారణంగా భూగర్భజలాల వినియోగం రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో పలు మండలాల్లో సుమారు వెయ్యి అడుగులకుపైగా బోరుబావులను రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్నప్పటికీ ఆయా విభాగాల అధికారులు చోద్యం చూస్తుండడం గమనార్హం.

విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం...
భూగర్భజలశాఖ నుంచి సాధ్యాసాధ్యల నివేదిక(ఫీజిబిలిటీ)అందిన తరవాతే రెవెన్యూశాఖ నూతన బోరుబావుల తవ్వకానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అదీ కేవలం 400 అడుగుల లోతు వరకు తవ్వేందుకు మాత్రమే అనుమతించాలి. అయితే ఈ నిబంధన గ్రేటర్‌ పరిధిలో కాగితాలకే పరిమితమౌతోంది. ప్రధాననగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వెయ్యి అడుగులకుపైగా బోరుబావులు తవ్వుతున్నా రెవెన్యూ శాఖ ప్రేక్షకపాత్రకే పరిమితమౌతోంది. ప్రధానంగా కుత్భుల్లాపూర్‌ మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, రా>జేంద్రనగర్, శంషాబాద్, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లో నిబంధనలకు విరుద్ధంగా బోరుబావులు తవ్వేస్తున్న ట్యాంకర్‌ మాఫియా..ఈ నీటిని అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, హోటళ్లు, హాస్టళ్లు, ఫిల్టర్‌వాటర్‌ ప్లాంట్లకు సరఫరా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. అత్యంత లోతుగా బోరుబావులు తవ్వుతుండడంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న బోరుబావులు వట్టిపోవడంతోపాటు భూగర్భజలమట్టాలు అనూహ్యంగా పడిపోతున్నట్లు భూగర్భజలశాఖ నిపుణులు స్పష్టంచేస్తున్నారు.

గ్రేటర్‌లో భూగర్భజలవిల ఇలా...
సుమారు 625 చ.కి.మీ పరిధిలో విస్తరించిన గ్రేటర్‌ జనాభా కోటికి చేరువైంది. మహానగరం పరిధిలో భవంతుల సంఖ్య సుమారు 25లక్షలుకాగా..బోరుబావులు 23 లక్షలమేర ఉన్నాయి. కానీ ఇంకుడు గుంతలసంఖ్య ఐదు లక్షలకు మించిలేవు. మరోవైపు నగరం దక్కన్‌పీఠభూమి కావడంతో రాతినేలలోకి వర్షపునీరు ఇంకడం చాలా ప్రాంతాల్లో కనాకష్టంగా మారింది. మరోవైపు రోజువారీగా ఆయా బోరు బావుల నుంచి సుమారు 650 కోట్ల లీటర్ల మేర భూగర్భజలాలు తోడుతున్నట్లు అంచనా. ఇక నగరంలో ఏటా కురుస్తున్న వర్షపాతం నేలగర్భంలోకి ఇంకేందుకు అవసరమైన ఇంకుడుగుంతలు,కుంటలు లేక సుమారు 65 శాతం మేర వృథాగా రహదారులపై ప్రవహించి చివరగా మూసీలో కలుస్తోంది. దీంతో నగరంలో ఏటేటా భూగర్భజలమట్టాలు అథఃపాతాళంలోకి పడిపోతున్నాయి. గ్రేటర్‌ శివార్లలో ప్రధానంగా భూగర్భజలాల వినియోగం అత్యధికంగా ఉంది. ప్రైవేటు ట్యాంకర్ల మాఫియా రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా బోరుబావులు తవ్వి ట్యాంకర్‌నీళ్లను విక్రయించి రూ.కోట్లు సొమ్ముచేసుకుంటున్నారు.

మరోవైపు రాజధానిలో నీటి బొట్టు కనుమరుగు కానుంది. వరుణుడు కరుణించినా..వాన చుక్క భూమిలోకి ఇంకే పరిస్థితులు లేక  గ్రేటర్‌ నగరంలో భూగర్భ జలమట్టాలు శరవేగంగా పడిపోతున్నాయి. విలువైన వర్షపునీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీఛార్జిపిట్స్‌ తగినన్ని లేక భూగర్భజలమట్టాలు పెరగడం లేదు.

గతంలోనే స్పష్టంచేసిన నీతి ఆయోగ్‌..
బహుళ అంతస్తుల భవంతులు..రహదారులతో కాంక్రీట్‌ మహారణ్యంలా మారిన మెట్రో నగరాల్లో భూగర్భజలాలు ఏటేటా అడుగంటుతూనే ఉన్నాయి. దేశంలోని 21 మెట్రో నగరాల్లో 2020 నాటికి పాతాళగంగ ప్రస్తుతం ఉన్న మట్టం కంటే అథఃపాతాళంలోకి చేరుకునే ప్రమాదం ఉందని..తక్షణం మేలుకోకపోతే 2030 నాటికి పరిస్థితి మరింత విషమిస్తుందని నీతిఆయోగ్‌ ఇటీవల విడుదల చేసిన ’కంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌’ నివేదికలో హెచ్చరించింది. తక్షణం మేలుకోని పక్షంలో 2030 నాటికి దేశ జనాభాలో సుమారు 40 శాతం మందికి స్వచ్ఛమైన తాగునీరు అందడం కనాకష్టంగా మారనుందని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడడం, వర్షపునీటిని నేలగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీఛార్జింగ్‌ పిట్స్‌ అవసరమైన మేరకు అందుబాటులో లేకపోవడంతో ఏటా భూగర్భజల మట్టాలు సుమారు 0.5 మీటర్ల చొప్పున అడుగంటుతుండడంతో పరిస్థితి విషమిస్తోందని స్పష్టంచేసింది.

మరిన్ని వార్తలు