సిటీలో భారీగా తగ్గిన భూగర్భ జలాలు..

12 Jun, 2019 09:45 IST|Sakshi

పలు మండలాల్లో 2 నుంచి 5 మీటర్ల లోతుకు నీరు..

విచ్చలవిడిగా బోర్ల తవ్వకాలు..

మండే ఎండలతో ఈ పరిస్థితి

నల్లా నీరు సరిపోక..బోర్లు ఎండిపోయి జనం విలవిల  

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో భూగర్భ జలాలు అథఃపాతాళంలోకి చేరాయి. మండుటెండలకు జలమండలి సరఫరా చేస్తున్న నల్లా నీరు ఏమూలకు సరిపోకపోవడంతో బోరుబావుల్లోని నీటి వినియోగం అనూహ్యంగా పెరిగింది. దీంతో పలు బోరుబావులు చుక్క నీరులేక బావురుమంటున్నాయి. మరోవైపు సిటీలో రోజువారీ అవసరాలకు అవసరమైన నీటి కోసం విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకంతో పాతాళగంగ అడుగంటింది. గతేడాది మే నెలతో పోలిస్తే పలు మండలాల్లో సరాసరిన 2 నుంచి 5 మీటర్ల మేర భూగర్భ జలమట్టం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. శివారు ప్రాంతాల్లో గేటెడ్‌ కమ్యూనిటీలు, స్వతంత్ర గృహాలు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం ఊపందుకోవడం, కాంక్రీటు మహారణ్యాలు విస్తరిస్తున్న కారణంగా భూగర్భజలాల వినియోగం రెట్టింపవుతోంది. ఈనేపథ్యంలో పలు మండలాల్లో సుమారు వెయ్యి అడుగులకుపైగా బోరుబావులను రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్నప్పటికీ ఆయా విభాగాల అధికారులు చోద్యం చూస్తుండడం గమనార్హం. కాగా గ్రేటర్‌ పరిధిలో మే 2019 వరకు సాధారణ వర్షపాతం 905 మిల్లీమీటర్లకుగాను ప్రస్తుతానికి 748 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదుకావడం కూడా భూగర్భజలమట్టాలు అనూహ్యంగా పడిపోవడానికి కారణమని భూగర్భజలశాఖ ప్రకటించింది.

విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం...
భూగర్భజలశాఖ నుంచి సాధ్యాసాధ్యాల నివేదిక(ఫీజిబిలిటీ)అందిన తర్వాతే రెవెన్యూశాఖ నూతన బోరుబావుల తవ్వకానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అదీ కేవలం 400 అడుగుల లోతువరకు తవ్వేందుకు మాత్రమే అనుమతించాలి. అయితే ఈ నిబంధన గ్రేటర్‌ పరిధిలో కాగితాలకే పరిమితమౌతోంది. ప్రధాననగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వెయ్యి అడుగులకుపైగా బోరుబావులు తవ్వుతున్నా రెవెన్యూ శాఖ ప్రేక్షకపాత్రకే పరిమితమౌతోంది. ప్రధానంగా కుత్భుల్లాపూర్‌ మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, రాజేంద్రనగర్, శంషాబాద్, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లో నిబంధనలకు విరుద్ధంగా బోరుబావులు తవ్వేస్తున్న ట్యాంకర్‌ మాఫియా..ఈ నీటిని అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, హోటళ్లు, హాస్టళ్లు, ఫిల్టర్‌వాటర్‌ ప్లాంట్లకు సరఫరా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. అత్యంత లోతుగా బోరుబావులు తవ్వుతుండడంతో ఆయా ప్రాం తాల్లో ఇప్పటికే ఉన్న బోరుబావులు వట్టిపోవడంతోపాటు, విచక్షణారహితంగా నీటిని తోడేస్తుండడంతో భూగర్భజలమట్టాలు అనూహ్యంగా పడిపోతున్నట్లు భూగర్భజలశాఖ నిపుణులు స్పష్టంచేస్తున్నారు.

గతంలోనే స్పష్టంచేసిన నీతి ఆయోగ్‌..
బహుళ అంతస్తుల భవంతులు..రహదారులతో కాంక్రీట్‌ మహారణ్యంలా మారిన మెట్రో నగరాల్లో భూగర్భజలాలు ఏటేటా అడుగంటుతూనే ఉన్నాయి. దేశంలోని 21 మెట్రో నగరాల్లో 2020 నాటికి పాతాళగంగ ప్రస్తుతం ఉన్న మట్టం కంటే అథఃపాతాళంలోకి చేరుకునే ప్రమాదం ఉందని..తక్షణం మేలుకోకపోతే 2030 నాటికి పరిస్థితి మరింత విషమిస్తుందని నీతిఆయోగ్‌ ఇటీవల విడుదల చేసిన ‘కంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌’ నివేదికలో హెచ్చరించింది. తక్షణం మేలుకోని పక్షంలో 2030 నాటికి దేశ జనాభాలో సుమారు 40 శాతం మందికి స్వచ్ఛమైన తాగునీరు అందడం కనాకష్టంగా మారనుందని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రధానంగా ఢిల్లీ,బెంగళూరు,చెన్నై,హైదరాబాద్‌ నగరాల్లో భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడడం, వర్షపునీటిని నేలగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీఛార్జింగ్‌ పిట్స్‌ అవసరమైన మేరకు అందుబాటులో లేకపోవడంతో ఏటా భూగర్భజలమట్టాలు సుమారు 0.5 మీటర్ల చొప్పున అడుగంటుతుండడంతో పరిస్థితి విషమిస్తోందని స్పష్టంచేసింది.

ఇంట్లో ఇంకుడు గుంత ఇలా ఉండాలి...
సాధారణ మధ్యతరగతి వినియోగదారులు తమ ఇళ్లలో బోరుబావికి సమీపంలో రెండు మీటర్ల లోతు(డెప్త్‌),1.5 మీటర్ల పొడవు,1.5 మీటర్ల వెడెల్పుతో ఇంకుడు గుంతను తవ్వాలి. ఈ గుంతను 50 శాతం 40 ఎంఎం పరిమాణంలో ఉండే కాంక్రీటు రాళ్లతో నింపాలి. మరో 25 శాతం జాగాను 20 ఎంఎం పరిమాణంలో ఉండే రాళ్లను నింపాలి. మిగతా 25 శాతం ఖాళీప్రదేశాన్ని దొడ్డు ఇసుక(బఠాణా)తో నింపాలి. దీని చుట్టూ వ్యర్థాలు చేరకుండా ఒక అడుగు ఎత్తున చిన్న గోడ నిర్మించాలి. ఈ గుంతలోకి ఇంటి పైకప్పు నుంచి నేరుగా వర్షపునీరు చేరేందుకు పెద్ద పైపును ఏర్పాటు చేయాలి.

ఇంకుడు గుంతతో ఉపయోగాలివే..
ఈ ఇంకుడు గుంతలో సీజన్‌లో సాధారణ వర్షపాతం (20 మిల్లీమీటర్లు) నమోదయ్యే రోజుల్లో ..రోజుకు 1600 లీటర్ల నీటిని నేలగర్భంలోకి ఇంకించవచ్చు. ఈ నీరు నలుగురు సభ్యులున్న కుటుంబానికి మూడురోజుల అవసరాలకు సరిపోవడం విశేషం. ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా మీ బోరు బావి ఎప్పటికీ వట్టిపోదు. అంతేకాదు భావితరాలకు మీరు జలబ్యాంక్‌ ఏర్పాటుచేసిన వారవుతారు. సామాజిక బాధ్యతగా ఇంకుడు గుంత తవ్వడం ద్వారా మీకే కాదు..మీ ఇంట్లో పెంచుకునే మొక్కలకు సైతం జలం..జీవం అందజేసిన వారవుతారు.  

గ్రేటర్‌లో సమస్య ఇలా...
సుమారు 625 చ.కి.మీ పరిధిలో విస్తరించిన గ్రేటర్‌ జనాభా కోటికి చేరువైంది. మహానగరం పరిధిలో భవంతుల సంఖ్య సుమారు 25లక్షలుకాగా..బోరుబావులు 23 లక్షలమేర ఉన్నాయి. కానీ ఇంకుడు గుంతలసంఖ్య ఐదు లక్షలకు మించిలేవు. మరోవైపు నగరం దక్కన్‌పీఠభూమి కావడంతో రాతినేలలోకి వర్షపునీరు ఇంకడం చాలా ప్రాంతాల్లో కనాకష్టంగా మారింది. మరోవైపు రోజువారీగా ఆయా బోరు బావుల నుంచి సుమారు 650 కోట్ల లీటర్ల మేర భూగర్భజలాలు తోడుతున్నట్లు అంచనా. ఇక నగరంలో ఏటా కురుస్తున్న వర్షపాతం నేలగర్భంలోకి ఇంకేందుకు అవసరమైన ఇంకుడుగుంతలు,కుంటలు లేక సుమారు 65 శాతం మేర వృథాగా రహదారులపై ప్రవహించి చివరగా మూసీలో కలుస్తోంది. దీంతో నగరంలో ఏటేటా భూగర్భజలమట్టాలు అథఃపాతాళంలోకి పడిపోతున్నాయి. గ్రేటర్‌ శివార్లలో ప్రధానంగా భూగర్భజలాల వినియోగం అత్యధికంగా ఉంది. ప్రైవేటు ట్యాంకర్ల మాఫియా రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా బోరుబావులు తవ్వి ట్యాంకర్‌నీళ్లను విక్రయించి రూ.కోట్లు సొమ్ముచేసుకుంటున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డీఐఎంఎస్‌లో ఏసీబీ తనిఖీలు

జైలులో జీవిత ఖైదీ ఆత్మహత్య

ఆమెకు రక్ష

సీఎం కేసీఆర్‌ది మేకపోతు గాంభీర్యం 

ఉగ్రవాదంపై ‘వర్చువల్‌’ పోరు!

నేటి నుంచి అసెంబ్లీ 

అజంతా, ఎల్లోరా గుహలు కూల్చేస్తారా? 

నల్లమలలో అణు అలజడి!

కోర్టు ధిక్కార కేసులో శిక్షల అమలు నిలిపివేత

వ్యవసాయానికి 5 శాతం కేటాయింపులా?: రేవంత్‌ 

సిటీకి దూపైతాంది

‘ఐ లవ్‌ మై జాబ్‌’ 

ఎలక్ట్రిక్‌ బస్సు సిటీ గడప దాటదా?

24 నుంచి ఇంజనీరింగ్‌ చివరి దశ కౌన్సెలింగ్‌

‘పుర’ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం 

భాగ్యనగరానికి జపాన్‌ జంగల్‌

ఎన్నికలకు నో చెప్పిన హైకోర్టు

ఈనాటి ముఖ్యాంశాలు

విషాదం: లిఫ్ట్‌ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి

హైదరాబాద్‌లో నీటికి ఢోకా లేదు..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

శ్రీచైతన్యలో పుడ్‌ పాయిజన్‌..40మందికి అస్వస్థత

సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారీ ఎన్‌కౌంటర్‌కు ప్లాన్‌

‘కేసీఆర్‌కు భవిష్యత్‌లో జైలు తప్పదు’

గ్రామాభివృద్ధికి సహకరించాలి :జిల్లా కలెక్టర్‌

‘నేను పార్టీ మారడం లేదు’

స్టూడెంట్‌ పోలీస్‌తో దురాచారాలకు చెక్‌!

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

‘విదేశీయుల’పై నజర్‌!

బాడీ బిల్డర్స్‌కు మంత్రి తనయుడి చేయూత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌