పాతాళంలో భూగర్భ జలం

7 Jan, 2019 11:19 IST|Sakshi

గతేడాది కంటే దిగువకు నీటిమట్టం

ఫీర్జాదిగూడ, బోడుప్పల్‌  మున్సిపాలిటీల్లో వేసవి

నీటి కష్టాలు   గుర్తించిన ప్రాంతాల్లో ట్యాంకర్లతో సరఫరా  

సాక్షి,మేడ్చల్‌జిల్లా: హైదరాబాద్‌ మహానగరంలో భాగమైన మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పడి పోయాయి. గతేడాది డిసెంబర్‌లో  జిల్లాలో సగటున భూగర్భ జలమట్టం 8.06 మీటర్లు కాగా, ఈ ఏడాది డిసెంబర్‌లో అది 12.51 మీటర్ల లోతుకు పడిపోయింది. నగరానికి తాగునీరు అందించే జలశయాల్లో నీటి మట్టాలు ఆశాజనకంగా లేకపోవడంతో ఈ ఏడాది వేసవిలో తాగు నీటి కష్టాలు తçప్పక పోవచ్చునని అధికారవర్గాలు అంచనే వస్తున్నాయి. అయితే, శివారు ప్రాంతాల్లో ఉండే ప్రైవేట్‌ నీటి సరఫరాదారులు, ఫ్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్లకు చెందిన కొందరు అక్రమదారులు భూగర్భ జలమట్టాలను విచక్షణారహితంగా తోడి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తిందని, నీటి సమస్యకు పెద్ద ప్రమాదం ఏర్పడిందని ప్రజల్లో అందోళన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో జిల్లాలో తాగునీటి  నీటి సమస్య తీవ్రంగా ఉందని భావిస్తున్న ప్రాంతాలను గుర్తించిన అధికారులు వేసవిలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మేడ్చల్‌ నియోజకవర్గం పరిధిలో 104 గ్రామాలకు గోదావరి జలాలను అందించే మిషన్‌ భగీరథ పనులు పూర్తవడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలకు తాగునాటికి కష్టాలు ఉండకపోవచ్చని జిల్లా అధికారులు చెబుతున్నారు. అయితే, జిల్లా పరిధిలో ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న బోడుప్పల్, ఫీర్జాదిగూడ మున్సిపాలిటీలతో పాటు పలు ప్రాంతాలకు తాగునీటితో పాటు ఇతర అవసరాలకు నీటి సమస్య తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు