నేటి నుంచి గ్రూప్‌ 2 ఇంటర్వ్యూలు 

1 Jul, 2019 02:41 IST|Sakshi

రోజుకు 48 మంది చొప్పున రెండు నెలలపాటు నిర్వహణ 

1,032 పోస్టులకు 2,190 మంది అభ్యర్థులు 

ఇంటర్వ్యూ విధానంలో నిష్పాక్షికతకు పెద్దపీట 

సాక్షి, హైదరాబాద్‌: గ్రూపు–2 పోస్టుల భర్తీలో భాగంగా సోమవారం(నేటి) నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 1,032 పోస్టుల భర్తీకి 2017లో నోటిఫికేషన్‌ జారీచేయగా, పలు న్యాయవివాదాల కారణంగా ఆలస్యమైంది. ఇటీవలే కోర్టు టీఎస్‌పీఎస్సీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పోస్టులభర్తీకి 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇంటర్వ్యూలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా(హాల్‌టికెట్‌ నంబర్లు)ను ప్రకటించింది. కోర్టు ఆదేశాలతో వచ్చిన అభ్యర్థులుసహా మొత్తం 2,190 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. దాదాపు రెండు నెలలపాటు ఈ ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ప్రతివారం తేదీలవారీగా ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సిన అభ్యర్థుల జాబితాను వారం మొదటే ప్రకటించాలని నిర్ణయించింది. ఇప్పటికే సోమవారం నుంచి 6వ తేదీ వరకు హాజరుకావాల్సిన 288 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అందులో ఏయే హాల్‌టికెట్‌ నంబర్లవారు ఏయే రోజున ఇంటర్వ్యూలకు హాజరుకావాలనే వివరాలను ప్రకటించింది. రోజూ ఉదయం 24 మందికి, మధ్యాహ్నం 24 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. దాదాపు రెండు నెలలపాటు (8 వారాలు) ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. రోజూ ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12:30 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయి. 

సమగ్ర సంస్కరణల దిశగా.. 
ఇంటర్వ్యూల విధానంలో సమగ్ర సంస్కరణలకు టీఎస్‌పీఎస్సీ శ్రీకారం చుట్టింది. ఇంటర్వ్యూల్లో కనీస, గరిష్ట మార్కుల విధానం మొదలుకొని ఒక్కొక్కటిగా అనేక సంస్కరణలను అమల్లోకి తెచ్చింది. ఇంటర్వ్యూల్లో నిష్పాక్షికతకు పెద్దపీట వేసింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న గ్రూపు–2 ఇంటర్వ్యూల్లోనూ వాటిని అమలు చేసేలా చర్యలు చేపట్టింది. ఒకప్పుడు ఇంటర్వ్యూలంటే అభ్యర్థి సామాజికవర్గం, ప్రాంతం, కుటుంబనేపథ్యంలో అనేక అంశాలను కూడా ఇంటర్వ్యూల్లో దాదాపుగా అడిగేవారు. కానీ, అప్పుడు అవేవీ అడగవద్దన్న నిబంధనను టీఎస్‌పీఎస్సీ విధించుకుంది. అభ్యర్థి పేరును బట్టి ఏ సామాజికవర్గానికి చెందినవారో గుర్తుపట్టే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు అవేవీ ఇంటర్వ్యూ బోర్డులో ఉండేవారికి తెలియకుండా చర్యలు చేపట్టింది. కుటుంబ నేపథ్యం తెలుసుకొని ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున అవి కూడా ఇంటర్వ్యూబోర్డులోని వారు అడక్కుండా నిబంధన విధించింది. గతంలో అభ్యర్థి పేరు, ప్రాం తం, ఇతర వివరాలను అడిగే విధానం ఉండగా, టీఎస్‌పీఎస్సీ రెడ్డి, రావు, యాదవ్‌ వంటి వివరాల తొలగింపుతో సంస్కరణలను వేగవంతం చేసింది. క్రమంగా ఇంటర్వ్యూ బోర్డులో ఉండే వారికి అభ్యర్థి వ్యక్తిగత వివరాలు అడక్కుండా చర్యలు చేపట్టింది. ఇంటర్వ్యూ బోర్డుల్లో ఉండే కమిషన్‌ సభ్యులు, సబ్జెక్టు నిఫుణులు కూడా ఏ బోర్డుకు ఎవరు వెళతారో ముందుగా తెలిసే అవకాశం లేకుండా చేసింది. కేవలం 10 నిమిషాల ముందే కమిషన్‌ సభ్యుడు గానీ, సబ్జెక్టు నిఫుణులుగానీ వెళ్లే బోర్డు వివరాలను ఆన్‌లైన్‌ అలాట్‌మెంట్‌ ద్వారా తెలియజేస్తారు.  

ఇంటర్వ్యూ బోర్డుకు ర్యాండమ్‌గా అభ్యర్థుల ఎంపిక  
ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆధారిత సంస్కరణలు అమలు చేస్తోంది. ఆన్‌లైన్లో ర్యాండమ్‌గా అభ్యర్థులను ఎంపిక చేసి బోర్డుకు కేటాయిస్తారు. అభ్యర్థుల హాల్‌టికెట్‌ నంబర్లు ఇంటర్వ్యూ బోర్డులో ఉండేవారికి తెలియకుండా సంస్కరణలు తీసుకువచ్చింది. ఇందుకోసం యూనిక్‌ టోకేన్‌ నంబర్‌ విధానం తెచ్చింది. ప్రతి అభ్యర్థి హాల్‌టికెట్‌ స్థానంలో యూనిక్‌ టోకెన్‌ నంబరు కేటాయిస్తుంది. ఆ టోకెన్‌ నంబర్లను ఇంటర్వ్యూ ప్రారం¿¶భం కావడానికి కొన్ని క్షణాల ముందు ఇంటర్వ్యూ బోర్డుకు పంపించేలా చర్యలు చేపట్టింది. దీంతో ఇంటర్వ్యూకు ఎవరు వస్తున్నారో.. ఏ బోర్డుకు ఎవరు వెళతారో తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నిష్పాక్షికతకు పెద్దపీట వేసింది. ఒకసారి వేసిన ఇంటర్వ్యూ మార్కులను, గ్రేడ్లను మార్పుచేసే వీలు లేకుండా ఆన్‌లైన్‌ గ్రేడింగ్, మార్క్స్‌ విధానం తెచ్చింది. ఒక అభ్యర్థికి గ్రేడ్, మార్కులను బోర్డులో ఉండేవారికి ఇచ్చే ట్యాబ్‌లోనే ఆన్‌లైన్‌లో వెంటనే పొందుపరిచేలా చర్యలు చేపట్టింది. అవి సర్వర్‌కు కనెక్ట్‌ అయి ఉండేలా చర్యలు చేపట్టింది. దాంతో ఒకసారి వేసిన మార్కులు, గ్రేడ్‌లను మార్పు చేసే వీలులేకుండా, పైగా గ్రేడ్‌లు, మార్కులేకాదు ఆ వివరాలు మొత్తం స్క్రీన్‌ పైనుంచి మాయం(డిజప్పియర్‌) అయ్యేలా చర్యలు చేపట్టింది. కాన్ఫిడెన్షియల్‌ వర్క్‌ చూసే అధికారి మాత్రమే సర్వర్‌లోని ఆ వివరాలను ఆన్‌లైన్‌లో క్రోడీకరించి ఫైనల్‌ రిజల్ట్‌ ఇచ్చేలా సంస్కరణలు తీసుకువచ్చింది.  

మరిన్ని వార్తలు