పౌరసరఫరాల ఐటీ సేవలపై అధ్యయనం

23 Mar, 2019 03:29 IST|Sakshi

కమిషనర్‌తో ఆసియాన్‌ దేశాల ప్రతినిధుల బృందం భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పౌర సరఫరాలశాఖలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, అమలుతీరుపై అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఏషియన్‌ నేషన్స్‌ (ఆసియాన్‌) దేశాల అధికారుల బృందం అధ్యయనం చేసింది. రాష్ట్రంలో కోట్లాది మంది పేదప్రజలకు సేవలందిస్తున్న పౌరసరఫరాల శాఖ సాంకేతికతను ఉపయోగించుకుంటున్న విధానం బాగుందని కొనియాడింది. శుక్రవారం ఇండోనేసియా, కంబో డియా, మయన్మార్, థాయ్‌లాండ్, వియత్నాం, మలేసియా దేశాల నుంచి గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక సంక్షేమాభివృద్ధి తదితర విభాగాలకు చెందిన 13 మంది అధికారులు పౌర సరఫరాల భవన్‌లో కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌తో సమావేశమయ్యారు.  శాఖలో చేపట్టిన వినూత్న చర్యలు, సంస్కరణలు, విధానాలపై 18 దేశాల ప్రతినిధులు అధ్యయనం చేశారు.  

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనితీరు, ఈ–పాస్, ఐరిస్‌ విధానం, టి–రేషన్‌ యాప్, గోదాముల్లో సీసీ కెమెరాలు, రేషన్‌ సరుకులు తరలించే వాహనాలకు జీపీఎస్, ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ పనితీరును పరిశీలించారు. సరుకుల పంపిణీ విధానం, రేషన్‌షాపులు, రేషన్‌ కార్డుల సంఖ్య, అక్రమాలకు తావులేకుండా లబ్ధిదారులకు ఏ విధంగా సరుకులు చేరుతున్నాయనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.  శాఖలో చేపట్టిన చర్యలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కమిషనర్‌  వివరించారు.  

మరిన్ని వార్తలు