కంట్లో చీకట్లు

6 Feb, 2018 03:47 IST|Sakshi

రాష్ట్రంలో పెరుగుతున్న కంటి జబ్బులు  

25 శాతం మందికి దృష్టి లోపాలు 

శుక్లాల వల్లే 43% మందికి అంధత్వం

 సత్వర వైద్యానికి ప్రత్యేక కార్యాచరణ 

సాక్షి, హైదరాబాద్‌: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు.. అయితే ముఖ్యమైన ఆ కన్నే ప్రమాదంలో పడిందిప్పుడు. మారుతున్న జీవనశైలి, పౌష్టికాహార లోపం తదితర కారణాల వల్ల కంటిచూపు సమస్యలు పెరుగుతున్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 25 శాతం మంది కంటి చూపు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పెద్ద వయస్సు వారికి శుక్లాలు (పొర), చిన్న పిల్లలకు పోషకాహార లోపం వల్ల దృష్టి లోపాలు వస్తున్నాయి. శుక్లాల కారణంగానే 43 శాతం మంది కంటిచూపు కోల్పోతున్నారని నిపుణు లు నిర్ధారించారు.

మధుమేహం కారణంగా కంటిచూపు సమస్యల(డయాబెటిక్‌ రెటినోపతి)తో బాధపడుతున్నవారూ పెరుగుతున్నా రు. రాష్ట్రంలోని 7 శాతం జనాభా డయాబెటిక్‌ రెటినోపతి సమస్యతో బాధపడుతున్నారు. వీరు కాకుండా మరో 7 శాతం మంది చూపు కోల్పోయేందుకు కారణమయ్యే నీటి కాసులు(గ్లకోమా) సమస్యతో బాధపడుతున్నారు. 40 ఏళ్లు దాటిన వారిలో గ్లకోమా లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అంధత్వ నివారణపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.

అన్ని రకాల దృష్టి లోపాలను గుర్తించేందుకు ప్రత్యేక సర్వేను చేపట్టింది. 550 గ్రామాలను ఎంపిక చేసి 2017 అక్టోబర్‌లో సర్వే మొదలుపెట్టింది. ఇటీవల వివరాలను నమోదు చేసింది. గ్రామీ ణ ప్రాంతాల్లోని ప్రతి వంద మందిలో ఇద్దరు కంటి చూపు సమస్యలతో బాధపడుతుండగా పట్టణాల్లో వంద మందిలో ఒకరు ఈ ఇబ్బం ది ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా శుక్లాల సమస్యతోనే కంటిచూపు కోల్పోతున్నారు. రాష్ట్రంలో 3.21 లక్షల శుక్లాల చికిత్సలు నిర్వహించారు. నేత్రదానంతో 5,126 మంది కంటిచూపును పొందారు.  

పోషకాహారం తీసుకోకపోవడం వల్లే.. 
మహిళలు గర్భంతో ఉన్నప్పుడు పోషకాహా రం తీసుకోకపోవడం వల్ల పిల్లలు పుట్టుకతోనే కంటిచూపు సమస్యల బారిన పడుతున్నారు. చిన్న వయస్సులోనే కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నవారు 7 శాతం మంది ఉంటున్నారు. నెలలు నిండకుండానే పుట్టిన వారిలో రెటినోపతి ఆఫ్‌ ప్రిమెచ్యూరిటీ సమస్య వస్తోంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే శాశ్వతంగా చూపు పోయే ప్రమాదం ఉంది. మన రాష్ట్రంలోని పిల్లల్లో కంటి చూపు సమస్య బాధితులు పెరుగుతున్నారు. 2014–15లో 5,44,469 మంది విద్యార్థుల్లో 24,947 మందికి కంటి చూపు సమస్యలున్నాయి. 2015– 16లో 6,53,156 మందిని పరీక్షించగా... 40,264 మంది బాధితులున్నారు. 2016– 17లో 6,10,234 మంది లో 40,367 మంది విద్యార్థులకు చూపు సమస్యలున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరీక్షల ఫలితాలు  రావాల్సి ఉంది.  

చికిత్స ఏర్పాట్లు... 
కంటి చూపు సమస్యల నివారణపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రత్యేక కార్యాచరణ మొదలుపెడుతోంది. మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ‘అంధత్వ రహిత తెలంగాణ(అవైడబుల్‌ బ్లైండ్‌నెస్‌ ఫ్రీ తెలంగాణ–ఏబీఎఫ్‌టీ)’పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. నేత్ర వైద్య నిపుణులు, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు దీంట్లో భాగస్వాములు అవుతున్నాయి. ఇందుకోసం మొదటి దశలో 2017–18లో 10 జిల్లాలను ఎంపిక చేసింది. వచ్చే ఏడాది 10 జిల్లాల్లో, మరో ఏడాది ఇంకో 10 జిల్లాల్లో ఇదే తరహా కార్యక్రమాలను నిర్వహించనుంది.  

రాష్ట్రంలో 2019 నాటికి కంటిచూపు సమస్యలు లేకుండా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. స్వచ్ఛంద సంస్థల సహకారంతో కంటి శుక్లాల శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాం. కొన్ని గ్రామాలను ఎంపిక చేసి పూర్తి స్థాయిలో వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నాం.      
– డాక్టర్‌ మోతీలాల్, జాయింట్‌ డైరెక్టర్, జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం 

శుక్లాల సమస్యతోనే ఎక్కువ మందికి కంటి చూపు సమస్యలు వస్తున్నాయి. కాలుష్యం సైతం కంటి సమస్యలకు కారణమవుతోంది. పోషకాహార లోపంతో చిన్న వయస్సులోనే కంటి చూపు సమస్యలు వస్తుంటాయి. మధుమేహం ఉన్నట్లు తేలితే వెంటనే కంటి పరీక్షలు చేయించుకోవాలి.      
– డాక్టర్‌ రవీందర్‌గౌడ్, సూపరింటెండెంట్, సరోజినిదేవి కంటి ఆస్పత్రి 

మరిన్ని వార్తలు