పెరుగుతున్న అత్యాచారాలు

22 Nov, 2014 03:28 IST|Sakshi

నిజామాబాద్ క్రైం : జిల్లాలో తరుచూ ఏదోఒక ప్రాంతంలో మహిళలు అఘాయిత్యానికి లోనవుతున్నారు. పెండ్లి చేసుకుని అత్తరింట్లో కాలు పెట్టిన మరుక్షణం నుంచే వరకట్నం వేధింపులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఎక్కువగా ఇలాంటి కేసులే నమోదవుతున్నాయి. గత పది నెలల్లోనే 528 వరకట్నం వేధింపు కేసులు నమోదు అయ్యాయి. ఇందులో వరకట్నం వేధింపులతో హత్యలు ఏడు ఉండగా, వరకట్నం వేధింపులకు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు 24 మంది ఉన్నారు.

ఇక జిల్లాలో మహిళలపై అత్యచారం కేసులు 37 నమోదు కాగా, ఇందులో 16 మంది మైనార్ బాలికలే! మరో 25 మంది మహిళలు వివిధ ఘటనలలో బలలయ్యారు. కాగా గృహ హింస కేసులు ఈ సంవత్సరం ఒక్కటి కూడా న మోదు కాకపోవటం గమనార్హం.

 మహిళా పోలీసులు కరువు
 జిల్లా జనాభాలో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. 12 లక్షల 99 వేల 882 మంది మహిళలు ఉండగా కేవలం 66 మంది సివిల్ మహిళా పోలీసులు, మహిళా హోంగార్డులు 68 మంది ఉన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు కనీసం అయిదుగురు మహిళా పోలీసు సిబ్బంది ఉండాలి. కాగా జిల్లాలోని 45 పోలీస్ స్టేషన్‌లకు 90 మంది మహిళా  కానిస్టేబుళ్లే పోస్టులే ఉన్నాయి.

 అయితే ప్రస్తుతం 66 మంది మహిళా కానిస్టేబుళ్లు మాత్రమే పనిచేస్తున్నారు. అలాగే 68 మంది మహిళా హోంగార్డులు పని చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఒకే ఒక్క మహిళా పోలీస్‌స్టేషన్ ఉంది. కాని ఇక్కడ మహిళా పోలీసు అధికారి లేకుండా పోయారు. దాంతో మహిళలు ఈ స్టేషన్‌కు రావాలంటే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ ప్రతివారం నిర్వహిస్తున్నప్పటికీ కుటుంబ తగాదాలతో వస్తున్న కొన్ని కేసులు పరిష్కారం అవుతుండగా, మరికొన్ని పెండింగ్ లో ఉంటున్నాయి.

 జిల్లాలో వివిధ ప్రాంతాల లో అన్యాయాలకు గురైన మహిళలు న్యాయం కోసం ఆయా పోలీస్‌స్టేషన్‌లకు వెళ్తే సరైన ఆదరణ లేకుండా పోతోందని వాపోతున్నారు. ఫిర్యాదు చేసేందుకు బాధిత మహిళలు కనీసం నాలుగైదుసార్లు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తోందంటున్నారు.  జిల్లాలో మహిళా జనాభాకు అనుగుణంగా మహిళ పోలీస్ సిబ్బంది లేక పోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ సబ్ డివిజన్ల పరిధిలోనే మహిళా కౌన్సెలింగ్ కేంద్రాలు నడుస్తున్నాయి. కౌన్సెలింగ్ కేంద్రాలలో బాధిత మహిళల సమస్యలు వినడానికి మహిళా ఎస్సైతో పాటు, మహిళ న్యాయవాది, మహిళా వైద్యురాలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిలు ఉంటారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మహిళా రిసిప్షనిస్టును నియమించవలసి ఉండగా, సిబ్బంది కొరతతో అది సాధ్యపడటంలేదు.

 జిల్లాలో మొత్తం 45 పోలీస్‌స్టేషన్లకు గాను 18 పోలీస్‌స్టేషన్లలో మహిళా రిసిప్షనిస్టులు ఒక్కరు కూడా కనిపించారు. దాంతో మహిళలు ప్రతి శనివారం నిర్వహించే ఫ్యామిలీ కౌన్సిలింగ్‌పైనే ఆధారపడుతున్నారు.

 మచ్చుకు కొన్ని కేసులు..
 ఎల్లారెడ్డిలోని బీడి కాలనీకి చెందిన నాగమణిని ఆమె భర్త రాజలింగం, అత్త సాయవ్వ కొంత కాలంగా అదనపు కట్నం కోసం వేధించటంతో ఈనెల 3న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.

 కామారెడ్డి మండలం సరంపల్లి గ్రామానికి చెందిన యశోద, పరిచయస్తుడైన ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌కు అప్పుగా రూ. 50 వేలు ఇచ్చింది. తిరిగి ఈ డబ్బులను ఇవ్వాలని కోరడంతో అక్టోబరు 14న మద్యం తాగించి చీర కొంగుతో ఉరే సి చంపాడు.

 బీర్కుర్ మండలం దుర్కి గ్రామానికి చెందిన మేతిరి బశెట్టి తన భార్య సవితతో నిత్యం గొడవ పడేవాడు. ఈ గొడవలకు నువ్వే కారణమంటూ తల్లి పోశవ్వను బండరాయితో మోది చంపాడు.

మరిన్ని వార్తలు