వచ్చేనెల 9న జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ

11 Aug, 2017 03:07 IST|Sakshi
  • సమావేశానికి హైదరాబాద్‌ ఆతిథ్యం
  • కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ సహా అన్ని రాష్ట్రాల ప్రతినిధుల రాక
  • సాక్షి, హైదరాబాద్‌: వస్తుసేవల పన్ను (జీఎస్టీ)కు మార్గదర్శకత్వం వహించే జీఎస్టీ కౌన్సిల్‌ 21వ సమా వేశానికి మన రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కౌన్సిల్‌ తదుపరి సమావేశం వచ్చేనెల 9న హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో పాటు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, వాణిజ్య పన్నుల శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు హాజరై జీఎస్టీ అమల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలపై దృష్టి సారించనున్నా రు.

    రాష్ట్రంలో వివాదాస్పదం..
    తెలంగాణలో  జీఎస్టీ అమలు వివాదాస్పదమవు తోంది. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై జీఎస్టీ అమలు వల్ల రూ.19,200 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం లెక్కలు కడుతోంది. అభివృద్ధి పనుల విషయంలో జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని రాష్ట్రం పట్టుబడుతోంది. దీనివల్ల రూ.6 వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి ఉపశమనం కలగనుందని పన్నులశాఖ అధికారులు చెపుతు న్నారు.

    ప్రస్తుతం ప్రారంభమైన అభివృద్ధి పనులకు 18 నుంచి 12 శాతానికి తగ్గిస్తామని, ప్రారంభం కావాల్సిన పనులకు మాత్రం అన్ని రాష్ట్రాలతో పాటు 18 శాతమే జీఎస్టీ వసూలు చేయాల్సి ఉంటుందని కేంద్రం మెలికపెడుతోంది. అయితే, ఏకంగా జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశమే హైదరాబాద్‌లో జరగనుం డడం తో అభివృద్ధి పనులకు ఉపయోగించే వస్తువులపై జీఎస్టీని 5శాతమే వసూలు చేయాలని కేంద్రం వద్ద ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అవసరమైన అన్ని నివేదికలను సిద్ధం చేస్తోంది. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కసరత్తును తీవ్రతరం చేశారు.  ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ కూడా హాజరయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు