‘పవర్‌’పై పన్ను!

9 Feb, 2019 07:08 IST|Sakshi

ఖమ్మంమయూరిసెంటర్‌:  విద్యుత్‌ వినియోగదారులపై పిడుగు పడింది. వస్తు సేవా పన్ను(జీఎస్టీ) రూపంలో ప్రభుత్వం భారం మోపింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీని విద్యుత్‌ మీటర్లపై కూడా వసూలు చేస్తోంది. పల్లె, పట్నం, పేద, ధనిక తారతమ్యం లేకుండా అన్ని వర్గాలకు 18 శాతం జీఎస్టీని విధిస్తున్నారు. కొత్త మీటర్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారు ముందుగానే 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే.. లేదంటే వారి దరఖాస్తుకు మోక్షం కలగదు.

జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి వినియోగదారులపై వస్తు సేవా పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో ఫిబ్రవరి నెల నుంచి వినియోగదారులకు వేసే విద్యుత్‌ బిల్లులో వస్తు సేవా పన్నును కలుపుతున్నారు. అలాగే కొత్తగా విద్యుత్‌ కనెక్షన్లు తీసుకున్న వారికి ఫిబ్రవరి బిల్లులో జీఎస్టీని కూడా కలిపి వడ్డించారు. ఇన్నాళ్లూ విద్యుత్‌ శాఖకు మినహాయింపు ఉందనుకుని జీఎస్టీ వసూలు చేయని విద్యుత్‌ సంస్థ.. ఇప్పుడు జిల్లావ్యాప్తంగా ఉన్న వినియోగదారుల నుంచి వసూలు చేయబోతోంది. జీఎస్టీ అమలైన సమయంలో విద్యుత్‌ శాఖకు మినహాయింపు అవకాశం ఉంటుందనే సమాచారంతో విద్యుత్‌ పంపిణీ సంస్థలు వినియోగదారుల నుంచి పన్ను వసూలు చేయలేదు. జిల్లావ్యాప్తంగా 2017, జూలై 1 నుంచి 2018, డిసెంబర్‌ 31వ తేదీ వరకు కొత్తగా 18,322 విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చారు. వారికి ఇన్నాళ్లూ కొత్త కనెక్షన్లు తీసుకోవడంపై జీఎస్టీ విధించలేదు. వాళ్లందరికీ ఫిబ్రవరి నెల విద్యుత్‌ బిల్లులో జీఎస్టీని జమ చేశారు. బిల్లుతోపాటు మరో 18 శాతం పన్ను వసూలు చేయబోతున్నారు.

పన్ను ఇలా..  
గృహ వినియోగం కోసం తీసుకున్న 240 వాట్స్‌ సామర్థ్యానికి రూ.108, వెయ్యి కిలోవాట్స్‌ సామర్థ్యమున్న వాటికి రూ.216, వాణిజ్య కనెక్షన్లలో కిలో(1000) వాట్స్‌ సామర్థ్యమున్న వాటికి రూ.225 చొప్పున అదనంగా ఈ నెల బిల్లులో వేశారు. మీటరు సామర్థ్యం పెరిగేకొద్దీ రుసుము పెరుగుతూ పోతుంది. జిల్లావ్యాప్తంగా రూ.75,17,000 వినియోగదారులపై సేవా పన్ను భారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన కింద నామమాత్రపు రుసుముతో ఇస్తున్న కనెక్షన్లకు మాత్రం జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చారు. 2017, జూలై 1వ తేదీ నుంచి 2018, డిసెంబర్‌ 31 వరకు జిల్లాలో వినియోగదారులు 18,322 కొత్త కనెక్షన్లు తీసుకున్నారు.  
 
ఆదేశాల మేరకే.. 

ప్రభుత్వ ఆదేశాల మేరకే ఫిబ్రవరి విద్యుత్‌ బిల్లులో జీఎస్టీని జమ చేశాం. ఇందులో శాఖాపరంగా ఎలాంటి ప్రమేయం లేదు. వినియోగదారులు ఉపయోగిస్తున్న విద్యుత్‌ సామర్థ్యాన్నిబట్టి జీఎస్టీ ఉంటుంది. జూలై 2017 నుంచి కొత్త కనెక్షన్లు తీసుకున్న వినియోగదారులకు ఫిబ్రవరి బిల్లులో జీఎస్టీని కలిపి బిల్లు వేస్తాం.  – కె.రమేష్, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ, ఖమ్మం సర్కిల్‌  

మరిన్ని వార్తలు