జీఎస్టీ అమలు అస్తవ్యస్తం!

29 Nov, 2017 02:16 IST|Sakshi

డీలర్ల నుంచి రాష్ట్ర పన్నులశాఖకు కనీస సమాచారమూ కరువు

ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లలో జీఎస్టీఆర్‌–1 నమోదు నిల్‌

ఆదాయం మాత్రం రూ. 8 వేల కోట్లు వచ్చిందంటున్న కేంద్రం

పరిహారం కింద రూ. 1,814 కోట్లు చూపిస్తున్న వైనం

ఇప్పటివరకు వచ్చిన రాష్ట్ర పన్ను రూ. 3,186 కోట్లే

కేంద్రం ఎంత ఇస్తుందో కూడా అర్థంగాని పరిస్థితుల్లో రాష్ట్రం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలు అస్తవ్యస్తంగా మారింది! పన్ను చెల్లించాల్సిన వ్యాపారులు ఏ వస్తువులు కొంటున్నారో, ఎన్ని వస్తువులు అమ్ము తున్నారో కూడా కనీస సమాచారం ఇచ్చే పరి స్థితి లేకుండా పోయింది. జీఎస్టీ కింద రిజిస్టర్‌ అయిన 2 లక్షల మందికిపైగా డీలర్లలో ఒక్క రు కూడా 3 నెలలుగా జీఎస్టీ రిటర్న్స్‌–1 నమో దు చేయకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తాము ఏం వస్తువులు కొంటున్నా మో ఇన్వాయిస్‌లతో సహా దాఖలు చేయాల్సి న వ్యాపారులు సాంకేతిక కారణాలతో జా ప్యం చేస్తుండటం, ఈ రిటర్న్స్‌ దాఖలు గడు వును కేంద్రం పదే పదే పొడిగిస్తుండటంతో ఏం వ్యాపారం జరుగుతుందో కూడా ప్రభుత్వానికి అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి.

జూలైలో తప్పిస్తే...
జీఎస్టీ అమల్లో భాగంగా వ్యాపారులు మూడు రకాల రిటర్న్‌లను దాఖలు చేయడంతో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందులో జీఎస్టీఆర్‌–1 ద్వారా ఒక డీలర్‌ ఏయే వస్తువులను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారో ఇన్వాయిస్‌లతో సహా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. జీఎస్టీఆర్‌–2 ద్వారా ఏయే వస్తువులు ఎవరికి అమ్మారో బిల్లులతో సహా ఇవ్వాల్సి ఉంటుంది.

జీఎస్టీఆర్‌–3 ద్వారా కొనుగోళ్లు, అమ్మకాల టర్నోవర్‌ లెక్కలను పేర్కొంటూ అమ్మిన వస్తువులున్న శ్లాబ్‌ ప్రకారం పన్నును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సి ఉంటుంది. జూలై తప్పిస్తే ఇప్పటివరకు ఒక్క డీలరూ జీఎస్టీఆర్‌–1ను దాఖలు చేయలేదు. రిటర్న్స్‌ దాఖలు చేసేందుకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలకుతోడు కేంద్రం పొడిగిస్తున్న గడువు, పన్నులశాఖ మొక్కుబడి కార్యక్రమాలకు పరిమితమవుతుండటం ఇందుకు ప్రధాన కారణమని ఆ శాఖ అధికారులే అంటున్నారు.


వ్యాట్‌ ఉన్నప్పుడే నయం
జీఎస్టీ అమలుతో రాష్ట్రానికి ప్రస్తుతం నెలకు రూ. వెయ్యి కోట్ల ఆదాయం రావట్లే దు.  గతంలో వ్యాట్‌ అమల్లో ఉన్నప్పుడు సగటున రూ. 1,500 నుంచి రూ. 1,600 కోట్ల వరకు పన్నుల ఆదాయం వచ్చేది.  ఇప్పుడు జీఎస్టీ ద్వారా నికరంగా నెలకు రాష్ట్రం రూ. 500–600 కోట్లు నష్టపోతోందన్నమాట. జీఎస్టీ అమల్లోకి వచ్చి నాలుగు నెలలవుతున్న నేపథ్యం లో ఇప్పటికే రూ. 2 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లిందన్నమాట. మరి ఈ నష్టం ఎలా పూడుతుందో, జీఎస్టీ నెట్‌వర్క్‌లో సాంకేతి క సమస్యలన్నీ తొలగి వ్యాపారులు పన్ను ను సకాలంలో చెల్లించే పరిస్థితి ఎప్పటికి వస్తుందో, కేంద్రం ఇవ్వాల్సిన పరిహార మొత్తాన్ని ఎప్పుడు ఇస్తుందో పెరుమాళ్లకే ఎరుక!

వచ్చేదెంత... పోయేదెంత?
వ్యాపారుల పరిస్థితి అలా ఉంటే.. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఎంత ఆదాయం వచ్చిందనే లెక్క కూడా సరిగ్గా తెలియకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి గుబులు పుట్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జీఎస్టీఎన్‌ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం తెలంగాణలో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 22 వరకు రూ. 10,535 కోట్లు ఆదాయం వచ్చింది. మొత్తం జీఎస్టీ కింద వచ్చిన పన్నులో కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ) కింద రూ. 2,129 కోట్లను కేంద్రం తీసుకుంటోంది. కేవలం రూ. 3,186 కోట్లు మాత్రమే రాష్ట్ర జీఎస్టీ (ఎస్‌జీఎస్టీ) కింద వచ్చింది.

మిగిలిన దాంట్లో రూ. 1,814 కోట్లను పరిహారం కింద చూపుతుండగా మరో రూ. 3,405 కోట్లు ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ (ఐజీఎస్టీ) ఉందని లెక్కలు చెబుతున్నాయి. అంటే ఎస్‌జీఎస్టీ కింద చూపిన రూ. 3,186 కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఈ నాలుగు నెలల్లో అధికారికంగా పన్ను కింద వచ్చింది. ఇక పరిహారం కోసం రాష్ట్రం ప్రతిపాదనలు పంపగా రూ. 300 కోట్లు ఇచ్చిన కేంద్రం... లెక్కల్లో మాత్రం రూ. 1,814 కోట్లను చూపుతుండటం గమనార్హం. ఆ మిగిలిన మొత్తం ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి. మరోవైపు ఐజీఎస్టీ కింద చూపిన రూ. 3,405 కోట్లలో 50 శాతం మళ్లీ కేంద్రానికి వెళుతుంది. అందులో మిగిలే రూ. 1,700 కోట్లలో రూ. వెయ్యి కోట్లకు మించి రాదని (ఇతర రాష్ట్రాలకు ఐజీఎస్టీ కింద కేంద్రం పంచాల్సిన నేపథ్యంలో) పన్నులశాఖ అధికారులే అంటున్నారు. ఇది కూడా ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు