‘జీరో’ జీఎస్టీ!

22 Oct, 2019 11:25 IST|Sakshi

జోరుగా టపాసుల వ్యాపారం  

తెల్లకాగితాలపైనే రూ.లక్షల బిల్లులు  

జీఎస్టీ ఎగ్గొట్టేందుకు వ్యాపారుల జీరో దందా  

అధికారుల అండతోనే వ్యవహారం  

సాక్షి సిటీబ్యూరో: ఏ వస్తువు కొనుగోలు చేసినా బిల్లు ఇవ్వడం తప్పనిసరి. వినియోగదారులు అడగడమూ అవసరం. ‘వినియోగదారుడా మేలుకో.. బిల్లు తీసుకో’, ‘సకాలంలో పన్నులు చెల్లించడం’ అంటూ వాణిజ్య పన్నుల శాఖ చేస్తున్న ప్రచారం కేవలం ప్రకటనలే పరిమితమవుతోంది. నగర మార్కెట్‌లో దీపావళి సందర్భంగా టపాసుల వ్యాపారం జోరుగా సాగుతోంది. అయితే ఇదంతా తెల్లకాగితాలపైనే జరుగుతున్నా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. టపాసులపై జీఎస్టీ 18 శాతం ఉండడంతో ఒక్క సంస్థ కూడా బిల్లు రూపేణా వ్యాపారం చేయడం లేదు. చాలా వరకు తెల్లకాగితాలపైనే బిజినెస్‌ చేస్తూ ‘జీరో దందా’ కొనసాగిస్తున్నాయి. ఇలా రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాయి.

అన్ని మార్కెట్లలోనూ అంతే... 
ఉస్మాన్‌గంజ్, సిద్ధిఅంబర్‌ బజార్, మలక్‌పేట్‌ ప్రాంతాలు టపాసుల వ్యాపారానికి అడ్డాలు. నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ హోల్‌సేల్‌ వ్యాపారం జరుగుతుంది. అయితే అన్ని మార్కెట్లలోనూ బిల్లులు ఇవ్వకుండానే సంబంధిత శాఖ అధికారుల అండదండలతో వ్యాపారులు దర్జాగా జీరో దందా చేస్తున్నారు. కొంతమంది నిజాయతీగా బిల్లులు ఇస్తుండగా... మరికొంత మంది వినియోగదారులు బిల్లులు అడిగినా ఏదో ఓ కాగితంపై రాసిస్తున్నారు. ఈ వ్యవహారమంతా సంబంధిత శాఖ అధికారులకు తెలిసే నడుస్తోంది. దీపావళి సీజన్‌లో ‘జీరో దందా’ నడిపేందుకు వ్యాపారులు పెద్ద మొత్తంలో మాముళ్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

దారులెన్నో...  
జీఎస్‌టీ చట్టం అమలులో ఉన్నా జీరో బిజినెస్‌కు దారులెన్నో ఉన్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అమ్మకాల విలువలో కొంత శాతం మాత్రమే వాణిజ్య పన్నుల శాఖ రికార్డుల్లో కనిపిస్తోంది. ఎంత పెద్ద మొత్తంలో బిల్లు అయినా తెల్ల కాగితంపై రాసిచ్చేస్తారు. దీనిపై తీసుకున్న వస్తువుల పేర్లు, దుకాణం పేరు, రిజిస్టర్‌ నంబర్‌ కనిపించవు. బిల్లు ఇస్తే ట్యాక్స్‌తో వస్తువుల ధర పెరుగుతుందని వ్యాపారులు చెబుతారు.

మరిన్ని వార్తలు