గుప్పుమంటున్న గుడుంబా..!

6 Jul, 2020 11:13 IST|Sakshi
తాండలో గుడుంబా తయారు చేస్తున్న మహిళలు (ఫైల్‌)

గ్రామీణ ప్రాంతాలే అడ్డాగా..

తరచూ దాడులు చేస్తున్న అధికారులు

కళ్లుగప్పి కొనసాగుతున్న దందా

నిర్మల్‌టౌన్‌: జిల్లాలో గుడుంబా గుప్పు మంటోంది. గుడుంబా రహిత జిల్లాలుగా ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ ఆయా జిల్లా ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులకు సూచించడంతో ఆ మేరకు జిల్లాలో గుడుంబా మాయమైంది. ఇటీవల జిల్లాలో విధించిన లాక్‌డౌన్‌ ఫలితంగా మళ్లీ గుడుంబా అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. మారుమూల ప్రాంతాలను అడ్డాగా చేసుకొని గుడుంబా తయారీని కొనసాగిస్తున్నారు. అధికారులు అప్పుడప్పుడు చేపడుతున్న తనిఖీల్లో పట్టుబడుతున్నా దందామాత్రం ఆగడం లేదు. కడెం, ఖానాపూర్, పెంబి, మామడ, లక్ష్మణచాంద, సారంగాపూర్‌ మండలాల పరిధిలోని గిరిజన, అటవీ ప్రాంతాల్లో గుడుంబాను తయారు చేస్తున్నారు.

ఉపాధి లేకే...
మారుమూల గ్రామాల్లో ఉపాధి లేక గ్రామీణులు గుడుంబా తయారీని ఆశ్రయిస్తున్నారు. దళారులు వారికి మాయమాటలు చెప్పి వారిచే గుడుంబా తయారు చేయించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. లాభం వారికి చేరుతుండగా, అమాయక గిరిజనులు మాత్రం ఎక్సైజ్‌ అధికారులకు చిక్కుతున్నారు. గతంలో గుడుంబా తయారీపై ఆధారపడిన వారికి ప్రభుత్వం రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేసి ఉపాధి అవకాశాలు కల్పించింది. కాగా జిల్లా పరిధిలో 20మందికి మాత్రమే ఈ అవకాశం లభించింది. మిగతా వారికి సైతం ఇలాంటివి కల్పిస్తే వారు ఈ వృత్తిని వీడే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా దాదాపు 100 మంది వరకు ఇలాంటి వారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

లాక్‌డౌన్‌లో విచ్చలవిడిగా...
లాక్‌డౌన్‌ సమయంలో గుడుంబా తయారీ విచ్చలవిడిగా కొనసాగింది. ఓ వైపు సాధారణ బ్రాండ్లు సైతం ధరల్లో కొండెక్కడంతో వారు గుడుంబాను ఆశ్రయించారు. ఈ సమయంలో గుడుంబా తయారీ మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగింది. ఈ సమయంలో డబ్బు సంపాదనకు అలవాటు పడిన వారు గుడుంబా తయారీని అలాగే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సైతం ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోవడంతో వారు ఇదే వృత్తికి అంకితమవుతున్నారు.

ఇంటిల్లి పాది...
గుడుంబా తయారీలో ఇంటిల్లిపాది భాగస్వాములవుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఖానాపూర్, ఇక్బాల్‌పూర్, మందపెల్లి ప్రాంతాల్లో ఎక్సైజ్‌ శాఖ అధికారులు చేపట్టిన దాడుల్లో పలువురు ఆడవాళ్లు సైతం గుడుంబా తయారు చేస్తూ పట్టుబడటం ఇందుకు నిదర్శనం. ఇటీవల పట్టుబడిన కేసులో 50లీటర్ల గుడుంబా, రెండు ద్విచక్రవాహనాలను ఎక్సైజ్‌ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని వెయ్యి లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు.

ఉపాధి కల్పిస్తున్నాం
గుడుంబా తయారీ దారులకు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తోంది. గతంలో 20 మందికి రూ.2 లక్షల చొప్పున ఉపాధి కోసం నిధులు అందించాం. గుడుంబా తయారీ దారులపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నాం. పట్టుబడ్డ వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.– రవీందర్‌రాజు, డీపీఈవో, నిర్మల్‌

మరిన్ని వార్తలు