‘అతిథి’కి అనుమతేది?

9 Nov, 2019 10:47 IST|Sakshi

త్రిశంకు  స్వర్గంలో గెస్ట్‌ లెక్చరర్లు 

నాలుగు నెలలు గడిచినా అందని రెన్యువల్‌ ఉత్తర్వులు 

సాక్షి, బాన్సువాడ రూరల్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న గెస్ట్‌ లెక్చరర్ల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా రెన్యువల్‌ ఉత్తర్వులు వెలువడకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడోరేపో ఉత్తర్వులు రాకపోతాయా..అన్న ఆశతో పనిచేస్తున్నారు.  జిల్లాలో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డిలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. అయితే కళాశాలల్లో శాశ్వత లెక్చరర్లు లేకపోవడంతో గెస్ట్‌ లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు.

నాలుగు కళాశాలల్లో కలిపి యాభై మంది గెస్ట్‌ లెక్చరర్లు ఉన్నారు. వీరికి గతేడాది ప్రతి నెలా రూ. 21,600 వేతనం అందించారు. సాధారణంగా గతేడాది విధులు నిర్వహించిన వారికే రెన్యువల్‌ ఇవ్వాల్సి ఉన్నా ఈసారి ఆగస్టు మాసంలో గెస్ట్‌లెక్చరర్ల ఖాళీలు భర్తీ చేయడానికి అర్హులైన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దీంతో గెస్ట్‌లెక్చరర్ల ఫోరం నాయకులు కోర్టును ఆశ్రయించగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 863 మంది పాత గెస్ట్‌ లెక్చరర్లనే కొనసాగించాలని ఉత్తర్వులు వచ్చాయి. అయితే పాత వారిని రెన్యువల్‌ చేయకుండా విద్యా శాఖ ఉన్నతాధికారులు అప్పీల్‌కు వెళ్లారు. దీంతో రెన్యువల్‌లో జాప్యం జరుగుతోంది.  

ఆర్థిక ఇబ్బందుల్లో ‘గెస్ట్‌’లు.. 
గత విద్యాసంవత్సరంలో గెస్ట్‌ లెక్చరర్లుగా పనిచేసినవారు ఈ విద్యాసంవత్సరంలో రెన్యువల్‌ కాకపోయినా.. విధులకు హాజరవుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రిన్సిపాల్‌ల కోరిక మేరకు కళాశాలలకు వస్తున్నారు. అయితే విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా వేతనాలు లేకపోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారింది.

కళాశాలకు రాకపోకలకు రవాణా ఖర్చులకూ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ తమకు రెన్యువల్‌ వచ్చేంత వరకు విధులకు రాకుండా ఉంటే విద్యార్థుల చదువులు ముందుకు సాగేవా అని గెస్ట్‌ లెక్చరర్లు  ప్రశ్నిస్తున్నారు. వెంటనే రెస్యువల్‌ చేసి, వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు.

ఐదేళ్లుగా పనిచేస్తున్నా.. 
నేను ఐదేళ్లుగా బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీకళాశాలలో మాథ్స్‌ గెస్ట్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. ఈ ఏడాది రెన్యువల్‌ ఉత్తర్వులు రాకున్నా విద్యార్థులకు అన్యాయం జరుగరాదనే ఉద్దేశంతో విధులకు హాజరవుతున్నా. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి, వెంటనే రెన్యువల్‌ ఉత్తర్వులు వెలువరించి న్యాయం చేయాలి. 
– భీమయ్య, మ్యాథ్స్‌ గెస్ట్‌ లెక్చరర్, బాన్సువాడ 

ఉత్తర్వులు రాలేదు 
గెస్ట్‌ లెక్చరర్లను ఈసారి రెన్యువల్‌ చేయలేదు. గతేడాది పనిచేసిన వారినే కొనసాగించాలంటూ కమిషనర్‌ నుంచి కూడా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. అయినా 12 మంది పాతవారు విధులకు హాజరవుతుండడంతో కళాశాలలో ఎలాంటి ఇబ్బంది తలెత్తడం లేదు. ప్రస్తుతం పోస్టుల రేషనలైజేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. కమిషనర్‌నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది.  
– గంగాధర్, ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీకళాశాల, బాన్సువాడ  

మరిన్ని వార్తలు