టెన్త్‌ విద్యార్థులకు గైడెన్స్‌

10 May, 2019 00:52 IST|Sakshi

పై చదువుల కోర్సుల  ఎంపికలో సహాయం

కౌన్సెలింగ్‌ చేయనున్న ప్రధానోపాధ్యాయులు

పాఠశాల విద్యా శాఖ నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆపై చదువుల కు ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలన్న అంశంపై తర్జనభర్జన పడుతుంటారు. పదో తరగతి తర్వాత ఎంపిక చేసుకునే కోర్సులపైనే విద్యార్థుల కెరీర్‌ ఆధారపడి ఉంటుంది. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కోర్సుల ఎంపికపై గైడెన్స్‌ ఇచ్చే వారు ఉండరు. దీంతో విద్యార్థులకు కెరీర్‌పై గైడెన్స్‌ ఇప్పించే బాధ్యతలను స్వయాన రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ తీసుకుంది. విద్యార్థుల మేథస్సు, ఆసక్తి, అభిరుచిల ఆధారంగా పై చదువులకు సంబంధించిన కోర్సుల ఎంపికలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సహకరించనున్నారు. పదో తరగతి ఫలితాలు ప్రకటించిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకెళ్లడానికి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఈ మేరకు కెరీర్‌ గైడెన్స్‌ ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. ప్రొఫెసర్‌ గార్డెనర్‌ హోవర్డ్‌ ప్రతిపాదించిన మేథస్సు సిద్ధాంతం ప్రకారం ప్రజల్లో ఉండే వివిధ రకాల మేథస్సులు, వాటికి అనుగుణంగా ఎంపిక చేసుకోవాల్సిన కెరీర్‌కు సంబంధించిన చార్టులను అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించింది.

► ఉదాహరణకు వాక్చాతుర్యం, భాష మీద పట్టు గల వారు న్యాయవాది, కమెడియన్, కమ్యూనికేషన్‌ స్పెషలిస్ట్, క్యూరేటర్, సంపాదకుడు, జర్నలిస్టు, చరిత్రకారుడు, లైబ్రేరియన్, మార్కెటింగ్‌ కన్సల్టెంట్, కవి, రాజకీయ నేత, పాటల రచయిత, టీవీషో హోస్ట్, ఉపాధ్యాయుడు, భాషా అనువాదకుడు, రచయిత కాగలరు.  
► తార్కిక, గణిత నైపుణ్యం గలవారు అకౌంటెంట్, ఆడిటర్, కంప్యూటర్‌ అనలిస్ట్, కంప్యూటర్‌ టెక్నీషియన్, కంప్యూటర్‌ ప్రొగ్రామర్, డేటాబేస్‌ డిజైనర్, డిటెక్టివ్, ఆర్థికవేత్త, ఇంజనీర్, గణితవేత్త, నెట్‌వర్క్‌ అనలిస్ట్, ఫార్మాసిస్ట్, ఫిజిషియన్, ఫిజీసిస్ట్, పరిశోధకుడు, స్టాటిస్టిషియన్, బుక్‌ కీపర్‌ కాగలరు.  
► దృశ్య నైపుణ్యం గల వారు 3డీ మోడలింగ్, సిమ్యూలేషన్, ఆర్కిటెక్ట్, ఆర్టిస్ట్, కంప్యూటర్‌ ప్రొగ్రామర్, ఇంజనీర్, ఫిల్మ్‌ యానిమేటర్, గ్రాఫిక్‌ ఆర్టిస్ట్, ఇంటీరియర్‌ డెకరేటర్, ఫొటో గ్రాఫర్, మెకానిక్, నావిగేటర్, ఔట్‌ డోర్‌ గైడ్, పైలట్, శిల్పుడు, వ్యూహకర్త, సర్వేయర్, అర్బన్‌ ప్లానర్, వెబ్‌మాస్టర్‌ కాగలరు. 

మరిన్ని వార్తలు