ఓవరైతే.. డేంజర్‌ !

25 Aug, 2019 01:32 IST|Sakshi

వాహన చట్టాలను కఠినంగా అమలు చేయాలి 

ఓవర్‌లోడ్‌ వాహనాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు 

పలు మార్గదర్శకాలు జారీ 

సాక్షి, హైదరాబాద్‌ : అధిక భారంతో వెళ్తున్న వాహనాలు రోడ్లపై బీభత్సం సృష్టిస్తున్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాహన పరిమితికి మించి లోడ్‌తో వెళ్తే ఆ వాహనాన్ని డ్రైవర్‌ నియంత్రించలేరని, ఈ వాహనాల వల్ల రోడ్డు ధ్వంసం కావడంతో పాటు కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. ధనార్జన కోసం యజమానుల దురాశ వల్ల అమాయకులు బలవుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. 1979లో రోడ్డు ప్రమాదాలపై జస్టిస్‌ వీఆర్‌ కృష్ణన్‌ ఆందోళన వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చి 30 ఏళ్లు దాటినా.. పరిస్థితిలో మెరుగు కాలేదని, రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉందని పేర్కొంది. రహదారి భద్రతకు చెందిన రెండు చట్టాలను కఠినంగా అమలు చేయని పక్షంలో మరిన్ని అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని వ్యాఖ్యా నించింది. ఈ నెల 4న ఆటో ప్రమాదంలో 13 మంది  వ్యవసాయ కూలీలు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. అధిక లోడ్‌తో వెళ్తున్న వాహనాలను సీజ్‌ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారించిన జస్టిస్‌ పి.నవీన్‌రావు ఇటీవల తీర్పు వెలువరించారు.  

చట్టాల అమలులో ఉదాసీనత... 
అధిక లోడ్‌తో, సామర్థ్యం లేని వాహనాలను నియంత్రించడానికి చట్టాల్లో నిబంధనలున్నప్పటికీ అమల్లో ఉదాసీనత కనిపిస్తోందని జస్టిస్‌ పి.నవీన్‌రావు పేర్కొన్నారు. సీజ్‌ చేసిన వాహనాలను అక్కడికక్కడే విడిచి పెట్టే అధికారం ఉన్నప్పటికీ ప్రాసిక్యూషన్‌ చేయడం లేదన్నారు. కఠినమైన శిక్షలు లేని పక్షంలో అమాయకుల ప్రాణాలకు రక్షణ కల్పించడం సాధ్యం కాదని, వాహనాన్ని వినియోగించుకునే హక్కు వ్యక్తులకు ఉందని,  ఇది విస్తృత ప్రజాప్రయోజనాలకు లోబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీజ్‌ చేసిన వాహనాల విడుదల విషయంలో దాఖలైన దరఖాస్తులను త్వరితంగా పరిష్కరించాలన్నారు. ప్రత్యామ్నాయం ఉండగా నేరుగా హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదన్నారు. మార్గదర్శకాలు జారీ చేశారు.  

ఇవీ మార్గదర్శకాలు

  • అధిక లోడుతో వెళ్తున్న వాహనాలను సీజ్‌ చేసినప్పుడు నేరుగా హైకోర్టులో పిటిషన్‌ విచారణార్హం కాదు. వాహన యజమాని, డ్రైవర్‌లో ఎవరైనా ఇక్కడ పిటిషన్‌ వేయడానికి ముందే చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయాలను వాడాలి. 
  • తెలంగాణ రాష్ట్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం సీజ్‌ చేసిన వాహన యజమాని ఆర్టీఏ కార్యదర్శి వద్ద దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై కార్యదర్శి చట్ట ప్రకారం పరిశీలించి తగిన ఉత్తర్వులివ్వాలి. షరతులతో వాహనాన్ని విడుదల చేయవచ్చు. దానికి ముందు విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా వాహన కండిషన్‌ను అధ్యయనం చేయడంతోపాటు దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం జారీ చేయాల్సి ఉంటుంది.  
  • వాహనాన్ని సీజ్‌ చేసే ప్రక్రియను వీడియోతో చిత్రీకరించి దాన్ని రికార్డులో భాగం చేయాలి. వీడియో రికార్డింగ్‌ విధానాన్ని రూపొందించాలి.  
  • కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంటే పరిష్కారంలో ఎక్కువ జాప్యం జరుగుతోందన్నది యజమానుల ఆవేదన. దీనికి పరిష్కార మార్గంగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ను తెరవాలి. ప్రస్తుతం ఉన్నదానిలో ప్రత్యేకంగా ఒక పేజీ, మొబైల్‌ అప్లికేషన్‌ను రూపొందించాలి. విచారణ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేపట్టాలి. దరఖాస్తుదారు కార్యదర్శి/ అధీకృత అధికారి వద్దకు రావాల్సిన అవసరంలేదు. నిర్దేశిత ప్రదేశాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యాలు కల్పించాలి. తీర్పు ప్రతి అందిన 6 వారాల్లో తాత్కాలికంగా వాహనాన్ని అప్పగించడానికీ, దరఖాస్తును పరిష్కరించడానికిగాను విధానాన్ని రూపొందించాలి.  ఈ దరఖాస్తును వారంలోగా పరిష్కరించాలి. 
  • మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఇప్పటికే విడుదలైన వాహనాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఈ కోర్టు చెప్పడం లేదు. అయితే ప్రాసిక్యూషన్‌ చేయడానికి, జరిమానా విధించడానికి ఈ ఉత్తర్వులు అడ్డంకి కావు. ఒకవేళ యజమాని అడ్వాన్స్‌ సొమ్ము చెల్లించినట్లయితే తప్పు తేలి విధించే జరిమానాతో సర్దుబాటు చేయాలి. యజమాని జరిమానా చెల్లించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. చట్టప్రకారం ప్రాసిక్యూషన్‌ చేయడానికి అధికారులకు అవకాశం ఉంది. ళీ జరిమానా చెల్లించడానికి వాహన యజమాని చేసుకున్న దరఖాస్తును అనుమతించినట్లయితే వాహనాన్ని విడుదల చేసే ముందు దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించి ధ్రువీకరణ జారీ చేయాలి. ఈ పత్రం ఉంటేనే వాహనాన్ని అనుమతించాలి. ళీ అక్రమాలకు పాల్పడుతున్న ఇసుక లారీలను స్వాధీనం చేసుకునే విషయంలో మైనింగ్‌ అధికారులు కూడా రవాణా శాఖతో అనుసంధానమై తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ళీ పోలీసు, పరిశ్రమల శాఖల అధికారులకు అవకాశం ఉండేలా ప్రయాణికులు, సరకు రవాణా వాహనాలు నిబంధనల ఉల్లంఘనలు ఆన్‌లైన్‌లో కనిపించేలా ఉండాలి. యజమాని/డ్రైవర్‌ పదేపదే ఉల్లంఘించినట్లయితే అవి ఆన్‌లైన్‌లో కనిపిం చాలి. తర్వాత వాటిపై చర్యలు తీసుకోవాలి. 
>
మరిన్ని వార్తలు