వర్సిటీల్లో పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు

26 Jan, 2018 03:07 IST|Sakshi

అధ్యాపక నియామకాల్లో మొత్తంగా 100 మార్కులతో స్క్రీనింగ్‌  

ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 11 విశ్వ విద్యాలయాల్లో త్వరలో చేపట్టనున్న 1,061 అధ్యాపక నియామకాల్లో 100 మార్కుల వెయిటేజీతో స్క్రీనింగ్‌ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెట్‌/స్లెట్‌/సెట్‌ ఉన్న సబ్జెక్టులకు రాత పరీక్ష లేకుండానే వెయిటేజీ ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలని పేర్కొంది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా ఈ విధానాన్ని సూచించింది. ఈ మేరకు ఈనెల 19న విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌. ఆచార్య నియామకాల మార్గదర్శకాలను పేర్కొంటూ జీవో 2ను జారీ చేశారు. ఇందులో గరిష్టంగా 50 మార్కులు అకడమిక్‌ రికార్డులకు, 30 మార్కులు సబ్జెక్టు నాలెడ్జి, టీచింగ్‌ స్కిల్స్‌కు, 20 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయించాలని స్పష్టం చేశారు.  

నెట్‌/స్లెట్‌/సెట్‌ లేని సబ్జెక్టులకు రాత పరీక్ష 
నెట్‌/స్లెట్‌/సెట్‌ లేని టెక్నికల్‌/ఇంజనీరింగ్‌/ఇతర ప్రత్యేక సబ్జెక్టులకు సంబంధించి మాత్రం 100 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలతో 100 మార్కులకు పరీక్ష నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో నెగిటివ్‌ మార్కుల విధానం ఉంటుంది. ప్రతి తప్పుడు జవాబుకు పావు మార్కు కట్‌ చేస్తారు. పరీక్ష సిలబస్, పరీక్ష విధానం గేట్‌ తరహాలో ఉంటుంది. అయితే ఆ 100 మార్కులకు వాటిని 14 మార్కులకు నార్మలైజ్‌ చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఆయా సబ్జెక్టులకు సంబంధించి అభ్యర్థికి పీహెచ్‌డీ ఉంటే పీహెచ్‌డీకి 7 మార్కులను కేటాయించాలి. రాత పరీక్షలో వచ్చిన మార్కులను మాత్రం మరో 7 మార్కులకు నార్మలైజ్‌ చేయాలి. 

మార్గదర్శకాల్లోని మరిన్ని అంశాలు.. 
పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేశాక, అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రతి యూనివర్సిటీ.. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి సబ్జెక్టు వారీగా స్క్రూటినీ కమిటీలను ఏర్పాటు చేయాలి. అందులో సంబంధిత సబ్జెక్టు డీన్, వైస్‌ చాన్స్‌లర్‌ నామినీ, ఇతర యూనివర్సిటీల నుంచి సబ్జెక్టు నిçపుణుడు, ఉన్నత విద్యా మండలి నామినేట్‌ చేసే సబ్జెక్టు నిపుణుడు, డిపార్ట్‌మెంట్‌ హెడ్, బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌ ఉండాలి. 
 

మరిన్ని వార్తలు