మలేషియాలో మన కార్మికులకు కష్టాలు 

28 Jul, 2018 12:53 IST|Sakshi
మలేషియాలో ఇరుక్కుపోయిన మన జిల్లా వాసులు

బాధితుల్లో నిర్మల్‌ జిల్లా వాసులు ఇద్దరు

రెండు నెలల నుంచి  పని లేక అవస్థలు

వర్క్‌ వీసాకు బదులు విజిట్‌ వీసాలు ఇచ్చిన ఏజెంట్లు

గడువు ముగిసిపోవడంతో  భయం

మోర్తాడ్‌(బాల్కొండ) నిజామాబాద్‌ : ఏజెంట్ల మోసంతో మన కార్మికులు మలేషియాలో అవస్థలు పడుతున్నారు. ఉపాధి పొందడానికి వీసా లు ఉన్నాయని నమ్మించిన ఏజెంట్లు విజి ట్‌ వీసాలు చేతిలో పెట్టి అక్కడికి పంపిం చారు. గడువు ముగిసిపోవడంతో నిజామాబాద్, నిర్మల్‌ జిల్లాలకు చెందిన 14 మంది మలేషియాలో ఒక గదిలో బిక్కు బిక్కుమంటూ ఉండిపోయారు. ఆర్మూర్, నిర్మల్, బాల్కొండలకు చెందిన ముగ్గురు ఏజెంట్లు వేరు వేరుగా కార్మికులను రెండు నెలల క్రితం మలేషియాకు పంపించారు.

ఒక్కో కార్మికుని వద్ద రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసిన ఏజెంట్లు వర్క్‌ వీసా ఇస్తామని మొదట నమ్మించారు.అయితే పదిహేను రోజుల వాలిడిటీ ఉన్న విజిట్‌ వీసాలను ఇచ్చి మలేషియాకు పంపించారు. మలేషియాలో తమకు సం బంధించిన వ్యక్తి ఉంటాడని అతను ఎయి ర్‌పోర్టు నుంచి రిసీవ్‌ చేసుకుని పని చూపుతాడని ఏజెంట్లు చెప్పారు.  

మలేషియాకు చేరుకున్న తరువాత వర్క్‌ వీసా ఇప్పిస్తాడని నమ్మించారు. ఒక్కో కార్మికునికి రూ.35 వేల వరకు వేతనం లభిస్తుందని ఏజెంట్లు చెప్పడంతో వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేసిన కార్మికులు వీసాల కోసం ఏజెంట్లు అడిగినంత చెల్లించారు. మలేషియా వెళ్లిన తరువాత కార్మికులను రిసీవ్‌ చేసుకున్న ఏజెంట్లకు చెందిన వ్యక్తి తనకు రూ.5 వేల చొప్పున చెల్లిస్తేనే పని చూపుతానని డిమాండ్‌ చేశాడు.

ఏజెంట్లకు మొత్తం డబ్బు చెల్లించిన తరువాతనే మలేషియాకు వచ్చామని మళ్లీ సొమ్ము చెల్లించడమంటే ఎలా అని కార్మికులు ప్రశ్నించా రు. తాను కోరినంత సొమ్ము ఇవ్వకపోతే పని చూపనని ఏజెంట్లకు సంబంధించిన వ్యక్తి మొరాయించడంతో కార్మికులు ఇంటి నుంచి మళ్లీ రూ.5 వేల చొప్పున సదరు వ్యక్తి ఖాతాకు సొమ్ము జమ చేయించారు. అయినప్పటికీ పలు ప్రాంతాలకు పని కోసం తిప్పిన మలేషియాలోని దళారి చివరకు పని చూపకుండానే పరారు అయ్యాడు.

దీంతో కార్మికులు ఒక గదిని అద్దెకు తీసుకుని తమకు తెలిసిన వారి ద్వారా పని కోసం ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ పని దొరికితే అక్కడ పని చేస్తున్నా సరైన వేతనం లేదని కేవలం పొట్ట నింపుకోవడం కోసం జీతం సరిపోతుందని కార్మికులు తెలిపారు. ఇలాగైతే తాము ఎలా అప్పులు తీరుస్తామని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. విజిట్‌ వీసా గడువు ముగిసిపోవడంతో మలేషియా పోలీసులు అరెస్టు చేస్తారేమోనని భయంతో బతుకుతున్నామని కార్మికులు వాపోయారు.  

మలేషియాలో బాధితులు వీరే... 

కమ్మర్‌పల్లి మండల చౌట్‌పల్లికి చెందిన వినో ద్, ఏశాల గంగన్న, వై వెంకట్, పురాణం భూమ య్య, మోర్తాడ్‌ మండలం ధర్మోరాకు చెందిన ఇట్టెడి ఆశన్న, గంగారాం, బాల్కొండ మండలం బోదెపల్లికి చెందిన బంగి బోజన్న, లక్ష్మణ్, జక్రాన్‌పల్లి మండలం కొలిప్యాకకు చెందిన కమలాకర్, బొల్లి లచ్చారాం, ఆర్మూర్‌ మండలం పిప్రికి చెం దిన అందె నారాయణ, ఏ. సతీష్, నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం కాల్వకు చెందిన శ్రీరామ్‌ రాములు, లక్ష్మణ్‌లు మలేషియాలో ఎన్నో కష్టాలు పడుతున్నారు. తమను మోసగించిన ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుని తమను ఎలాగైనా మలే షియా నుంచి ఇంటికి రప్పించాలని కార్మికులు వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు