9 నెలలకు స్వగ్రామానికి మృతదేహం

16 Mar, 2020 08:41 IST|Sakshi
సిర్గాపూర్‌కు చేరిన చందు మృతదేహం

సాక్షి, అదిలాబాద్‌: రెక్కాడితేగాని డొక్కడాని పరిస్థితి, ఉన్న ఊళ్ళో వ్యవసాయ కూలీగా జీవనం, దినదినం పెరిగిన కుటుంబ ఖర్చులు వెరసి ఆ యువకుడికి అందరిలాగే బయటి దేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పిల్లలను బాగా సాకుదామన్న కలసాకారం కాకుండానే ఆ యువడిని విధి వక్రీకరించి. ఏడాది తిరగకక మునుపే తొమ్మిది నెలల కిందట విద్యుత్‌ షాక్‌తో సౌదీలో మృత్యువాత పడ్డాడు. మండలంలోని సిర్గాపూర్‌ గ్రామానికి చెందిన కదిలి చందు(26) తొమ్మిది నెలల కిందట సౌదీలో తాను పనిచేస్తున్న చోట విద్యుత్‌ షాక్‌తో మృత్యువాత పడ్డాడు.

9నెలలుగా ఆ కుటుంబ పడ్డ వేదన వర్ణనాతీతం. నిత్యం రోదన సౌదీలో ఉంటున్న స్థానికులకు వేడుకోలుతో అక్కడి కూలీలుగా పనిచేస్తున్న తెలంగాణ యువకులు చందాలు చేసి మృతదేహాన్ని తరలించేందకు శ్రమించారు. మృతి చెందిన వెంటనే అక్కడి అధికారులు అన్ని లాంచనాలు పూర్తి చేసినా మృతదేహాన్ని తరలించడంతో తీవ్ర జాప్యం చేశారు. ఆదివారం ఉదయం చందు మృతదేహం స్వగ్రామమైన సిర్గాపూర్‌కు చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు పలువురుని కంటతడి పెట్టించాయి. ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్య హేమలత, కుమారుడు విష్ణువర్థన్, కూతులు వైష్ణవిలు ఉన్నారు.


                   సౌదీలో చందాలు వసూలు చేస్తున్న వలస కూలీలు

స్పందించిన గల్ఫ్‌ కార్మికులు         
మృతదేహం కోసం ఎంత వేచిచూసినా ఫలితం లేకపోవడంతో చివరకు గల్ఫ్‌ కార్మికుల అవగాహన వేదిక సభ్యులు బడుగు లక్ష్మన్, మోహన్, గోవింద్, గణేష్, గంగన్న, శ్రీకాంత్‌లు తోటి కార్మికుల సహాయంతో మృతదేహాన్ని స్వగ్రామమైన సిర్గాపూర్‌కు తరలించడంలో తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరికి చందాలు వేసుకుని చందు మృతదేహాన్ని ఆ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై పాలసీని అమలు పరిచి గల్ఫ్‌లో మృతి చెందిన వారికి రూ. పదిలక్షల ఎక్స్‌గ్రేసియా అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా