ప్రాణహిత ప్రాణం తీసిన ప్రభుత్వం

18 Jul, 2018 11:46 IST|Sakshi
కాలువను పరిశీలిస్తున్న అఖిలపక్ష నాయకులు

దహెగాం(సిర్పూర్‌): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పుట్టిన ప్రాణహిత ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించకుండా వార్ధానదికి తరలించి ప్రాణహిత  ప్రాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసిందని సీపీఐ బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ , జల సాధన సమితి అధ్యక్షుడు నైనాల గోవర్ధన్‌ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా మండల కేంద్రం సమీపంలో అసంపూర్తిగా ఉన్న ప్రాణహిత కాలువను సందర్శించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రాణహిత వద్ద ప్రాజెక్టు నిర్మించకుండా వార్ధా నదికి మార్చడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి జిల్లాకు కేసీఆర్‌ తీరని ద్రోహం చేయడమే అన్నారు. ప్రాణహిత తుమ్మిడిహెట్టి 148 మీటర్ల, మైలారం 138, గోదావరి సుందిళ్ల 132 మీటర్లకు అనుసంధానం చేసే సంపూర్ణ గ్రావిటీ కాలువకు కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకున్న వార్ధానదికి ప్రాజెక్టు మార్చే నిర్ణయం గొడ్డలి పెట్టులాంటిదన్నారు.

ప్రాణహిత ప్రాజెక్టుకు వైఎస్సార్‌ హయాంలో అంబేద్కర్‌ సుజల స్రవంతిగా నామకరణం చేశారని నేడు అంబేద్కర్‌ పేరును లేకుండానే ఈ ప్రభుత్వం చేస్తోందన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరానికి ఈ ప్రాజెక్టును తరలించారన్నారు. జిల్లాలో ఉన్న ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రాణహిత ప్రాజెక్టును 148 మీటర్ల ఎత్తుకు సీఎం కేసీఆర్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి ఒప్పందం కుదుర్చుకొని ఒంటెలపై ఊరేగింపు చేసుకున్న సీఎం.. చారిత్రక ద్రోహం చేశారన్నారు. అనంతరం సిర్‌పూర్‌ నియోజకవర్గం నాయకుడు పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో సిర్‌పూర్‌ ఎమ్మెల్యే కోనప్ప ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం ఇక్కడే జరగడానికి ప్రాణహితకు అడ్డంగా పడుకొని నియోజకవర్గానికి సాగునీటికోసం నీళ్లు ఇప్పిస్తామన్న చెప్పిన ఎమ్మెల్యే నేడు ప్రాజెక్టు తరలిపోతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మన చుట్టూ నీళ్లు ఉన్నా మన పొలాలకు సాగు నీరు అందక పోవడం పాలకుల కుట్రలో భాగమే అన్నారు.  అఖిలపక్షం నాయకులు బద్రి సత్యనారాయణ, చాంద్‌పాషా, లాల్‌కుమార్, అంబాల ఓదెలు, వెంకట నారాయణ, నాగుల తిరుపతి, కోండ్ర రాజా గౌడ్, చిలువేరు కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు