ఓటెత్తి కొడితే ఢిల్లీ కైవసం కావాలె..

1 Apr, 2019 14:58 IST|Sakshi
ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న నర్సింహారెడ్డి, చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, సైదిరెడ్డి 

విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

పాలకవీడు (హుజూర్‌నగర్‌) : ఓటెత్తి కొడితే ఢిల్లీ కైవసం కావాలని, అందుకు టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు మంత్రి జగదీశ్‌రెడ్డి, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఆయనతో కలిసి మండలం లోని జాన్‌పహాడ్‌దర్గా నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా దర్గాలో సైదులు బాబాకు చాదర్, దట్టీ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ 70ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలోని దరిద్రాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో అభివృద్ధి పరుచుకున్నామని తెలిపారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్‌ మాటలు వినే స్థితిలో ప్రజలు లేరని, అలాంటి పార్టీకి ఓటేస్తే మోరీల్లో వేసినట్లేనన్నారు. ఈ ఎన్నికల్లో వేమిరెడ్డి నర్సిం హారెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో రైతులకు 24గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. రాష్ట్రంలోని రైతులు ఆర్థికంగా ఎదగడం కోసం రైతుబందు, రైతుబీమా వంటి పథకాలు ప్రవేశపెట్టిందని కూ డా మనమేనన్నారు. ఇంకా కల్యాలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతోపాటు వితంతు, వికలాంగులు, వృద్ధులకు రెట్టింపు స్థాయిలో పెన్షన్లు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నల్లగొండ ప్రజల ఫ్లోరిన్‌ సమస్యను ఎందుకు పట్టించుకోలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

రాజకీయ అవగాహనలేని వారిని నామీద ఎంపీ అభ్యర్థిగా నిలిపారని మాట్లాడుతున్న ఉత్తమ్‌ను దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో  గెలవాలని మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్‌ విసిరారు. హుజూర్‌నగర్‌కు ముందుగానే ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించినట్లయితే ఈ రోజు పరిస్థితి వేరేలా ఉండేదన్నారు టీఆర్‌ఎస్‌ 16ఎంపీ స్థానాలు గెలిపించుకుంటే దేశంలో గుణాత్మకమార్పుకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుడతారన్నారు. అభ్యర్థి నర్సింహారెడ్డి మా ట్లాడుతూ తనను ఆదరించి నల్లగొండ ఎంపీగా గెలిపించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు మలిమంటి దర్గారావు, వై.సత్యనారాయణరెడ్డి క్యాకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు