విధేయతకు పట్టం

19 Feb, 2019 08:26 IST|Sakshi

సీఎం కేసీఆర్‌ నుంచి ఆయనకు ఫోన్‌ 

ఉమ్మడి జిల్లాలో రెండోసారి వరించిన అమాత్య పదవి 

ప్రమాణ స్వీకారానికి తరలుతున్న నేతలు

సీఎం కేసీఆర్‌ విధేయతకు పట్టం కట్టారు. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయం చేశారు. సీఎం నేరుగా జగదీశ్‌రెడ్డికి ఫోన్‌ చేసి మంత్రి పదవి ఇస్తున్న విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. మంగళవారం మిగతా మంత్రులతో పాటు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయన రెండో సారి మంత్రి పదవి చేపడుతున్నారు. 

సాక్షిప్రతినిధి, సూర్యాపేట: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా జగదీశ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని ఆయనకు సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేసిన తర్వాత అధికారుల నుంచి కూడా ఫోన్‌ వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట నియోజకవర్గం నుంచి జగదీశ్‌రెడ్డి 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. అప్పట్లో ఉమ్మడి జిల్లా నుంచి ఆయన ఒక్కడికే మంత్రి వర్గంలో చోటు దక్కింది. ఉమ్మడి జిల్లాలో పార్టీతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయనదే పై చేయి అయింది. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరినా ఉమ్మడి జిల్లా నుంచి జగదీశ్‌రెడ్డికే సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యమిచ్చారు. సీఎం జిల్లాకు ఎప్పుడు వచ్చినా జగదీశ్‌రెడ్డి ముందుండి కార్యక్రమాలు నడిపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మది స్థానాల్లో ఆపార్టీ విజయఢంకా మోగించడం, సూర్యాపేట నుంచి జగదీశ్‌రెడ్డి విజయంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. నేతలు, పార్టీ శ్రేణుల ప్రచారాన్ని వాస్తవం చేస్తూ సీఎం మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన అనుచరగణం ఆనందంలో మునిగింది.
 
ఉద్యమం నుంచి గులాబీ బాస్‌ వెన్నంటే.. 
ఉద్యమం నుంచి జగదీశ్‌రెడ్డి గులాబీ బాస్‌ కేసీఆర్‌కు వెన్నంటే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ్యుల్లో ఒకడిగా ఉండడంతో తొలి నుంచి కేసీఆర్‌ ఆయనకు గుర్తింపునిచ్చారు. పలు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ఆయన ఇన్‌చార్జిగా వ్యవహరించారు. తొలి సారి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో తొలి విద్యాశాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆతర్వాత విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో పని చేశారు. విద్యుత్‌ శాఖ ఆయనకు అప్పగించిన తర్వాతే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందించింది. అంతేకాకుండా దామరచర్ల, పాల్వంచ, మణుగూరులో నూతనంగా విద్యుత్‌ ప్లాంట్లు మంజూరయ్యాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందించడంతో ప్రభుత్వం సాధించిన ఘనతలో జగదీశ్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ నుంచి ప్రశంసలు అందాయి. ఇలా అన్నింటా కేసీఆర్‌కు అనుంగు నేతగా ఉన్న ఆయనకు మంత్రి పదవి దక్కింది. 

ప్రమాణస్వీకారానికి తరలుతున్న నేతలు.. 
కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో జరగనుంది. అయితే జగదీశ్‌రెడ్డికి సీఎం నుంచి మంత్రి పదవిపై ఫోన్‌ రావడంతో జిల్లాలోని ఆపార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు అభినందనలు తెలిపారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్‌ ఆయన వెంటే ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఆయనను అభినందించడానికి జిల్లా నుంచి తరలివెళ్తున్నారు. 

జగదీశ్‌రెడ్డి బయోడేటా
పేరు    : గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 
తండ్రి   :  చంద్రారెడ్డి 
తల్లి    : సావిత్రమ్మ 
భార్య    : సునీత 
కుమారుడు    : వేమన్‌రెడ్డి 
కూతురు    : లహరి 
పుట్టినతేదీ    : 18.07.1965 
స్వగ్రామం    : నాగారం (నాగారం మండలం) 
విద్యార్హత    : బీఏ, బీఎల్‌ 

 • 27.04.2001 టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ్యులు 
 • 2001 సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌చార్జి, సిద్దిపేట ఉప ఎన్నికల ఇన్‌చార్జి 
 • 2002 మహబూబ్‌నగర్‌ పాదయాత్ర ఇన్‌చార్జి (జల సాధన 45 రోజుల కార్యక్రమం. పాదయాత్ర ఆలంపూర్‌ నుంచి ఆర్డీఎస్‌ వరకు..) 
 • 2003 మెదక్‌ ఉప ఎన్నికల ఇన్‌చార్జి 
 • 2004 సిద్దిపేట ఉప ఎన్నికల ఇన్‌చార్జి (హరీష్‌రావు ఎన్నిక) 
 • 2005 సదాశివపేట మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి 
 • 2006 కరీంనగర్‌ ఎంపీ ఉప ఎన్నికల ఇన్‌చార్జి 
 • 2008 ముషీరాబాద్, ఆలేరు ఉప ఎన్నికల ఇన్‌చార్జి, మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి 
 • 2009లో హుజూర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ 
 • 2013లో నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి 
 • 2014లో సూర్యాపేట నుంచి పోటీ .. విజయం 
 • తెలంగాణలో తొలి విద్యాశాఖ మంత్రి 
 • ఆతర్వాత విద్యుత్‌శాఖ , ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి 
 • 2108 డిసెంబర్‌ అసెంబ్లీ ఎన్నికలు.. సూర్యాపేట నుంచి విజయం  
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా