తరలిపోతున్న గురుకులాలు

25 Apr, 2018 12:31 IST|Sakshi
మోర్తాడ్‌లోని బీసీ గురుకుల పాఠశాలకు కేటాయించిన భవనం

అనువైన భవనాల్లేక..

మోర్తాడ్, ఎడపల్లి గురుకుల పాఠశాలలు తరలించడంపై అభ్యంతరాలు

మోర్తాడ్‌(బాల్కొండ): వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనను ఉచితంగా అందించడానికి ప్రభుత్వం గతేడాది ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలను ఇప్పుడు ఉన్న చోటు నుంచి పొరుగు మండలాలకు తరలించాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా అధికారులు ప్రభుత్వానికి పంపించారు. నియోజకవర్గానికి ఒక బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 2017–18కు గాను బా ల్కొండ నియోజకవర్గానికి సంబంధించి మోర్తాడ్, ఆ ర్మూర్‌ నియోజకవర్గానికి సంబంధించి ఖుద్వాన్‌పూర్‌ లో, బోధన్‌ నియోజకవర్గం పాఠశాలను ఎడపల్లిలో, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం పాఠశాలను చీమన్‌పల్లిలో, నిజామాబాద్‌ అర్బన్‌ పాఠశాలను నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. చీమన్‌పల్లి పాఠశాలకు అద్దె భవనం ఆలస్యంగా దొరకగా సౌకర్యాలను కల్పించడానికి అర్బన్‌లోనే కొనసాగించారు. గడచిన విద్యా సంవత్సరానికి గాను 5, 6, 7 తరగతులకే విద్యా బోధన అందించారు. 2018–19 విద్యా సంవత్సరానికి గాను ఎనిమిదో తరగతి ఆరంభం కానుంది.

కొత్త విద్యార్థులు వస్తున్నప్పటికీ..
అలాగే తాజాగా ప్రవేశ పరీక్షలను నిర్వహించగా కొత్తగా ఐదో తరగతిలోకి విద్యార్థులు అడ్మిషన్లను పొందనున్నారు. నిన్న మొన్నటి వరకు మూడు తరగతులు రెండే సెక్షన్‌ల చొప్పున ఉండగా మొత్తం 240 మంది విద్యార్థులకు విద్యతో పాటు వసతిని కల్పించారు. అయితే  కొత్త విద్యార్థులకు సరిపడే వసతి లేని కారణంగా ఐదు పాఠశాలల్లో మూడింటిని తరలించాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. ప్రధానంగా మోర్తాడ్‌లోని గురుకుల పాఠశాలను బాల్కొండకు, ఎడపల్లిలోని పాఠశాలను బోధన్‌కు, అర్బన్‌లో కొనసాగుతున్న రూరల్‌ నియోజకవర్గం పాఠశాలను చీమన్‌పల్లికి తరలించాలని ప్రతిపాదనలు చేశారు.  మోర్తాడ్‌ గురుకులాన్ని బాల్కొండకు, ఎడపల్లి గురుకులాన్ని బోధన్‌ హెడ్‌క్వార్టర్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తరలిస్తారా లేదా అనే విషయం ఇంకా తేలడం లేదు. గురుకుల పాఠశాలలను తరలించడానికి బదులు అద్దెభవనమా, ప్రభుత్వ భవనాన్ని పరిశీలించి ఎక్కడి పాఠశాలలను అక్కడే కొనసాగించాలని పలువురు కోరుతున్నారు.  

ప్రతిపాదనలు సిద్ధం చేశాం
బీసీ గురుకుల పాఠశాలలను తరలించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. తొందరలోనే వీటిని తరలిస్తాం. పాఠశాలలు ఆరంభం కాకముందే పొరుగు మండలాలకు వీటిని తరలించి విద్యార్థులకు అనువైన వాతావరణం కలిగేలా చూస్తాం. కొత్త తరగతు లు కూడా ప్రారంభం కాబోతున్నాయి.– తిరుపతి,బీసీ గురుకులాల రీజినల్‌ కో ఆర్డినేటర్‌

మరిన్ని వార్తలు