నా ఓటు పోయింది : గుత్తా జ్వాల

7 Dec, 2018 14:07 IST|Sakshi
గుత్తా జ్వాలా

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పేరు ఓటర్ల జాబితాలో గల్లంతైంది. ‘ నా ఓటు పోయింది. ఆన్‌లైన్‌ ఓటరు జాబితాలో నా ఓటు లేకపోవడంతో ఆశ్చర్యపోయాను’ అని ట్వీట్‌ చేశారు. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లతో నిరసన తెలిపారు.  గత ఎన్నికల్లో తాను ఇక్కడే ఓటు వేశానని, ఇప్పుడు ఎందుకు లేదో, ఏ కారణంతో తన పేరును తొలగించారో తెలియదంటూ ఆవేదన చెందారు. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైనప్పుడు ఎన్నికలు ఎలా పారదర్శకంగా జరిగినట్లని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మంది వారి పేర్లు కూడా గల్లంతయ్యాయని ట్వీట్‌ చేస్తూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.96 శాతం పోలింగ్‌ నమోదైంది. నగరంలోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో 40 వేల ఓట్లు గల్లంతవ్వగా.. జాంబాగ్ డివిజన్‌, జూబ్లీహిల్స్‌లో కూడా భారీగా ఓట్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఓటు హక్కు వినియోగించుకుందామని వచ్చినవారు.. జాబితాలో పేరు లేదని అధికారలు చెప్పడంతో తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరికొందరు ఆందోళనకు దిగుతున్నారు. ఎన్నికల ముందే అధికారులు భారీ కసరత్తు మొదలు పెట్టినా జాబితాలోని తప్పులను గుర్తించలేకపోయారు. 

మరిన్ని వార్తలు