యూట్యూబ్‌లో పాఠాలు..లక్షల్లో ఆదాయం

27 Nov, 2017 09:26 IST|Sakshi

యూట్యూబ్‌లో పాఠాలు..లక్షల్లో ఆదాయం

ఆదర్శంగా నిలుస్తున్న యైటింక్లయిన్‌ యువకుడు 

5కోట్ల వ్యూస్‌తో దూసుకెళ్తున్న వైనం

పెద్దపల్లి(యైటింక్లయిన్‌కాలనీ):  సోషల్‌మీడియాలో గంటలకొద్దీ సమయం వెచ్చిస్తూ యువత కాలాన్ని వృథా చేస్తుంటే..హఫీజ్‌ మాత్రం అదే సోషల్‌మీడియా వేదికగా ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కంప్యూటర్‌ కోర్సులు, మొబైల్‌ ప్రాబ్లమ్స్‌పై వీడియోలు రూపొందించి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తూ ప్రతి నెల రూ.1.50లక్షల ఆదాయం పొందుతున్నాడు. యూట్యూబ్‌లో హఫీజ్‌ నిర్వహిస్తున్న తెలుగు టెక్‌ ట్యూట్స్‌కు 4కోట్ల వ్యూస్‌..4.30లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు.

2006లో ప్రారంభం  
రామగుండం మండలం యైటింక్లయిన్‌కాలనీలో కం ప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న ఎస్డీ హఫీజ్‌ 2006లో యూట్యూబ్‌లో తన తొలి పాఠాన్ని అప్‌లోడ్‌ చేశారు. టెక్నాలజీతో జరుగుతున్న మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు పాఠాలను వీడియోలుగా రూపొందించి అప్‌లోడ్‌ చేయడం ప్రారంభించారు. 10వేలమంది వ్యూస్‌తో ప్రారంభమైన ‘తెలుగు టెక్‌ ట్యూబ్స్‌’ 4కోట్ల వ్యూస్‌కు చేరుకుంది. కంప్యూటర్‌ సెంటర్‌ నిర్వహిస్తూనే ఎంఎస్‌ ఆఫీస్, సీలాంగ్వేజ్‌ ఎలా నేర్చుకోవాలో యూట్యూబ్‌లో వివరించారు. ఆ సమయంలో ఇంటర్నెట్‌ వినియోగం పెద్దగా లేకపోవడంతో స్పందన కూడా అంతంతే ఉండేది. కాలక్రమంలో ఇంటర్నెట్‌ వినియోగం పెరగడంతో హఫీజ్‌ అప్‌లోడ్‌ చేస్తున్న వీడియోలకు ప్రేక్షకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2014 తర్వాత స్మార్ట్‌ఫోన్ల వినియో గం పెరగడంతో వ్యూస్, ఫాలోవర్స్‌ పెరిగారు. ఎస్‌ఈవో, ఆటోకాడ్, టాలీ, జావా, వెబ్‌డిజైనింగ్‌ కోర్సులను తెలుగువారి కోసం యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. 

మొబైల్‌ సీక్రెట్స్‌కు స్పందన  
స్మార్ట్‌ఫోన్‌లు ఎలా వినియోగించాలి, సీక్రెట్‌ సెట్టింగ్స్‌ ఎలా ఉంటాయి..అనే అంశాలపై తెలుగులో అర్థమయ్యేలా వీడియోలు రూపొందించి తెలుగు టెక్‌ ట్యూట్స్‌ ద్వారా అందిస్తున్నారు. ఇటీవల హఫీజ్‌ టెక్నికల్‌ వివరణకు మంచి స్పందన లభిస్తోంది. ఇలా ఒక్క సీక్రెట్‌ సెట్టింగ్స్‌ వీడియో అప్‌లోడ్‌కు 12లక్షల వ్యూస్‌ వచ్చాయి. హఫీజ్‌ అడ్రస్‌ తెలుసుకుని విజయవాడ, వైజాగ్‌ ప్రాంతాల నుంచి చాలా మంది యువకులు టెక్నాలజీ నేర్పించాలని యైటింక్లయిన్‌కాలనీకి వస్తున్నారు.

హఫీజ్‌ తయారు చేసిన మొబైల్‌ సీక్రెట్స్‌
సిల్వర్‌ ప్లే బటన్‌ అవార్డు  
యూట్యూబ్‌లో హఫీజ్‌ వీడియోలకు లక్షకుపైగా వ్యూస్‌ పెరగడంతో ఆ సంస్థ సిల్వర్‌ ప్లేబటన్‌ అవార్డును ప్రకటించింది. ఈమేరకు పోస్టు ద్వారా అవార్డు, ప్రశంసాపత్రంను సైతం పంపించింది. గోల్డెన్‌ ప్లేబటన్‌ సాధించడమే తన లక్ష్యమంటున్నారు హఫీజ్‌.  

ప్రతినెల రూ.1.50లక్షలు ఆదాయం
యూట్యూబ్‌ ద్వారా తెలుగుటెక్‌ ట్యూట్‌ పేరుతో అప్‌లోడ్‌ చేస్తున్న వీడియోలకు ఆదరణ పెరగడంతో ఆసంస్థ ప్రతినెలా రూ.1.50లక్షలను హఫీజ్‌ ఖాతాల్లో వేస్తోంది. అయితే హఫీజ్‌ వీడియోలను ఇతరులు కాపీ చేసి తమ సైట్లలో అప్‌లోడ్‌ చేస్తుండడంతో వ్యూస్‌ తగ్గి ఆదాయం కూడా రూ.లక్షకు తగ్గిందని తెలిపారు. ఇటీవల విజయవాడలో జరిగిన సదస్సులో రెండు రాష్ట్రాల్లో అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తిగా నిలిచారు.

చైతన్య పర్చడమే లక్ష్యం
మొబైల్‌ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలు సైతం మొబైల్‌ ద్వారా చేస్తున్నారు. అదనుగా చూస్తున్న హ్యాకర్స్‌ ఖాతాలను హ్యాక్‌ చేస్తూ రూ.కోట్ల కొద్ది సొమ్ము దోచుకుంటున్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నదే నా ఉద్దేశ్యం. అందుకే టెక్‌ట్యూట్స్‌ పేరిట సైట్‌ ప్రారంభించాను. అన్ని కోర్సులు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నది లక్ష్యం. నిరుపేదలు యూట్యూబ్‌ ద్వారా సంపాదించేలా వారిని చైతన్యవంతం చేసేందుకు ఉచితంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తా.   – ఎస్డీ హఫీజ్, ఎంఏ ఇంగ్లిష్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా