మృతదేహం కోసం హైడ్రామా..

28 Mar, 2016 02:50 IST|Sakshi
మృతదేహం కోసం హైడ్రామా..

ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ మృతి
మృతదేహం తమకంటే  తమకని కుటుంబ సభ్యుల  ఆందోళన
పోలీసుల ఆధ్వర్యంలో  అంత్యక్రియలు
 

ఆదిలాబాద్ క్రైం : ఆదిలాబాద్ పట్టణంలోని పాత హౌసింగ్‌బోర్డు కాలనీలో శనివారం ఆత్మహత్యాయత్నం చేసిన మేకల రాజేశ్వరి (35) రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 1 గంటకు మృతి చెందింది. కాగా ఉదయం రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆమె మృతదేహం కోసం హైడ్రామా నెలకొంది. ఆమె తల్లిదండ్రులు, భర్తతరపు వారు మృతదేహం మాకంటే మాకు కావాలని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పినా వినకుండా గొడవకు దిగారు. పోలీసులతో కూడా వాగ్వాదం పెట్టుకున్నారు.

వీరి ఆందోళనతో 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మృతదేహాన్ని పోస్టుమార్టం గది నుంచి బయటకు తీయలేదు. దీంతో శాంతిభద్రతల దృష్ట్యా ఇరువురి కుటుంబ సభ్యులకు కాకుండా పోలీసులే అంత్యక్రియలు చేసేందుకు నిర్ణయించారు. పోలీసు బందోబస్తు మధ్య పట్టణంలోని తిర్పెల్లి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

అక్రమ సంబంధంపై నిలదీసినందుకే..
తన భర్త సాగర్ వేరే మహిళతో ఉన్న అక్రమ సంబంధంపై నిలదీసినందుకే మా కూతురును వేధింపులకు గురిచేసే వాడని ఆమె తల్లిదండ్రులు అంకుశ్, లక్ష్మి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తరచూ గొడపడుతూ మానసికంగా హింసించేవాడని, అది తట్టుకోలేకే రాజేశ్వరి ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐ తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన రాజేశ్వరి, మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన సాగర్‌తో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు వైష్ణవి, వికాస్, శైలజ ఉన్నారు. సాగర్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు.

గతేడాదే ఉద్యోగ రిత్యా సాగర్ ఆదిలాబాద్ బదిలీపై వచ్చి పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉంటున్నారు. తరచూ గొడవలు జరగడంతో రాజేశ్వరి మానసిక వేదనకు గురై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుందని సీఐ తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సాగర్‌పై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు