అకాల వర్షం.. అపార నష్టం

15 Apr, 2014 03:52 IST|Sakshi

* వడగళ్ల వానతో నేలకొరిగిన పంటలు
* పిడుగుపాటుతో ఆరుగురు మృతి

 
 సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం గాలివాన, వడగళ్లతో కూడిన అకాలవర్షాలు భారీనష్టాన్ని కలిగించాయి. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లగా.. మరోవైపు పిడుగు లు పడి ఆరుగురు మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఒకరు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. పొలం పనులకు వెళ్లిన రంగారెడ్డి జిల్లా గండేడ్ మండలం మహమ్మదాబాద్‌కు చెందిన నీరేటి మహేందర్(13), నీరేటి వెంకటయ్య(22), బేడిసందమ్మ(50)లు వర్షం వస్తుండడం తో ఓ మర్రిచెట్టు కిందకు చేరారు. అదే సమయంలో పిడుగు పడడంతో వీరంతా మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడిన మహేందర్ తండ్రి నీరేటి పెద్ద యాదయ్యను ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
 
 మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మం డలంలోని అంబట్‌పల్లిలో లక్ష్మమ్మ (40), తెలకపల్లి మండలం గట్టు నెల్లికుదురులో భాస్కర్‌గౌడ్(18) అనే ఇంటర్ విద్యార్థి పిడుగుపాటుకు గురై మృతి చెందారు. వీరిద్దరూ పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకుంటూ పిడుగుపాటుకు గురయ్యారు. షాద్‌నగర్ మండలంలోని మదనాపూర్‌లో పిడుగుపాటుతో మరో మహిళ తీవ్రంగా గాయపడింది. అలాగే కర్నూలు జిల్లా నందవరంలో పిడుగుపాటుకు ఉప్పర రాముడు(55) అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండురోజులుగా కురుస్తున్న అకాలవర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నాశనమైంది. పెద్దసంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లాలో యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, శంషాబాద్ మండలాల్లో పంటలు నేల కొరగడం తో  తీవ్రంగా నష్టం వాటిల్లింది.
 
వచ్చే 36గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు: వాతావరణ శాఖ
 విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉన్నట్టు విశాఖ వాతావరణశాఖ తెలిపింది. దీని  ప్రభావంతో రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రంపూట ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నట్టు తెలిపింది. వచ్చే 36 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ సోమవారం తెలి పింది. ఇవి అకాల వర్షాలు కావని, సాధారణంగా ఏప్రిల్ నుంచి ఇలా వేసవి వర్షాలు కురవడం మామూలేనని ఆ శాఖ అధికారులు తెలిపారు. ‘‘పగలు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు వడగాల్పులు ఉంటాయి. సాయంత్రం వాతావరణం చల్లగా మారగానే ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఏటా ఇలాంటి వేసవి వర్షాలు ఏప్రిల్‌లో ఆరంభమవుతాయి.
 
 అయితే రాష్ట్రంలో ఈ సంవత్సరం మార్చిలోనే ఇలా వడగండ్ల వర్షం కురిసింది’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ‘సాక్షి’కి వివరించారు. కాగా గడచిన 24 గంటల్లో కోస్తాంధ్రలోని వీరఘట్టంలో గరిష్టంగా 4 సెం.మీ. వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణశాఖ వెల్లడించింది. పాడేరులో 1 సెం.మీ, రాయలసీమలోని ఆలూరులో 2, కర్నూలులో 1, తెలంగాణలోని భువనగిరిలో గరిష్టంగా 3 సెం.మీ., కామారెడ్డిలో ఒక సెం.మీ. వర్షపాతం కురిసినట్టు పేర్కొంది. హైదరాబాద్‌లోనూ పలుచోట్ల ఓ మోస్తరు వర్షం పడింది. సోమవారం రాత్రి 8.30 గంటల వరకు 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.    

>
మరిన్ని వార్తలు