కంప్యూటర్‌ ఇంజినీర్‌ కత్తెర పట్టాడు

18 Jun, 2018 10:59 IST|Sakshi

ఉన్నత విద్య చదివి.. హెయిర్‌ డ్రెస్సర్‌గా ఎదిగి..

జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం  

కులవృత్తిలో రాణిస్తున్న సంపత్‌కుమార్‌

ఫ్యాషన్‌ రంగంలో సరికొత్త మెలకువలు

కంప్యూటర్‌ కీ బోర్డుపై ఆడించాల్సిన చేతులు.. సెలూన్‌లో కత్తెర పట్టి హెయిర్‌ డ్రెస్సింగ్‌ చేస్తున్నాయి.. కులవృత్తికి మించింది లేదు గువ్వల చెన్నా.. అనే నానుడిని నిజం చేస్తున్నాడీ  కంప్యూటర్‌ ఇంజినీర్‌..
కులవృత్తిలో రాణిస్తున్నాడు.తానెంచుకున్న వృత్తికి చదువును జోడించి తన ప్రత్యేకతనుచాటుకుంటున్నాడు.అంతేకాకుండా ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన పోటీల్లో బంగారు పతకాన్ని సాధించాడు చారమ్స్‌ హెయిర్‌ బ్యూటీ సెలూన్‌ నిర్వాహకుడు సంపత్‌ కుమార్‌.

రాంగోపాల్‌పేట్‌  : సికింద్రాబాద్‌ కార్ఖానాలోని కాకాగూడకు చెందిన నారాయణ, సత్య దంపతుల కుమారుడు సంపత్‌కుమార్‌. తండ్రి సికింద్రాబాద్‌ వైఎంసీఏ కాంప్లెక్స్‌లో చారŠమ్స్‌ హెయిర్‌ డ్రెస్సింగ్‌ పేరుతో రెండు దశాబ్దాలుగా బ్యూటీ సెలూన్‌ నిర్వహిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖుల వద్ద వ్యక్తిగత హెయిర్‌ డ్రెస్సర్‌గా కూడా పనిచేస్తున్నారు. కుమారుడు సంపత్‌కుమార్‌ 2011లో బీటెక్‌ కంప్యూటర్స్‌ పూర్తి చేశాడు. కొద్దినెలల పాటు ఉద్యోగంలో చేరి నెలకు రూ.25 వేల నుంచి రూ.30వేల జీతం పొందేవాడు. కానీ ఆ ఉద్యోగం నచ్చక తండ్రి వద్దే హెయిర్‌ డ్రెస్సర్‌గా పనిచేస్తున్నాడు. అందరిలో ఒకడిగా ఉండకూడదని భావించి భిన్నంగా కనిపించాలని ఈ నిర్ణయానికి వచ్చాడతను. 

డిప్లొమాలు..ప్రముఖుల వద్ద శిక్షణ
సంపత్‌కుమార్‌ హెయిర్‌ డ్రెస్సర్‌ వృత్తిలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని అంతర్జాతీయ పోకడలు, ఫ్యాషన్, తదితర అంశాల్లొ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో డిప్లొమాలు చేశాడు. ముంబైలోని ఉదయ్‌ టెక్కీస్‌ ఇనిస్టిట్యూట్‌తో పాటు అంతర్జాతీయ నిపుణుల వద్ద పలు డిప్లొమా కోర్సులు పూర్తి చేశాడు. అంతర్జాతీయంగా వస్తున్న ఫ్యాషన్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, హెయిర్, స్కిన్‌లకు సంబంధించి ఎన్నో కొత్త విషయాలను ఆకళింపు చేసుకుని ముందుకెళ్తున్నాడు. నగరంలోనే ఈ రంగంలో ఇన్ని డిప్లొమాలు చేసి ఎంతో నైపుణ్యం సంపాదించుకున్న వారిలో సంపత్‌కుమార్‌ లాంటి వారు లేరంటే అతిశయోక్తి కాదు. 

జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం
ఈ నెల 4, 5 తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఆలిండియా హెయిర్‌ అండ్‌ బ్యూటీ అసోసియేషన్‌ పోటీలను నిర్వహించింది. దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖ హెయిర్‌ బ్యూటిషియన్లు, మేకప్‌ ఆర్టిస్ట్‌లు పాల్గొన్నారు. ఇందులో సంపత్‌కుమార్‌ హెయిర్‌కట్, మేకప్‌లో బంగారు పతకం సాధించాడు. గతంలో సూరత్‌లో జరిగిన పోటీల్లోనూ సంపత్‌ వెండి పతకం సాధించాడు. త్వరలో అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో బహుమతి సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. 

ఇనిస్టిట్యూట్‌ పెడతా..  
ఎంతోమంది తమ కులవృత్తిని వదిలి ఇతర వృత్తుల్లోకి వెళుతున్నారు. రోజురోజుకూ ఫ్యాషన్‌ ఈ రంగం విస్తృతమవుతోంది. ఈ వృత్తిలో ఉండేవారు నైపుణ్యాలకు మెరుగులు పెట్టుకునేందుకు ఒక ఇనిస్టిట్యూట్‌తో శిక్షణ అందించాలనుకుంటున్నాను.– సంపత్‌ కుమార్‌

మరిన్ని వార్తలు