చదువుకునేందుకు వెళ్లి బలయ్యారు..

7 Feb, 2020 02:18 IST|Sakshi

పేదకుటుంబాలైనా బడికి పంపిన తల్లిదండ్రులు

రవాణా వసతి లేకపోవడంతోనే బాలికల బలి

సాక్షి, యాదాద్రి: ‘బేటీ బచావో బేటీ పడావో’నినాదంతో బాలికల రక్షణ, చదువు కోసం ప్రాధాన్యమిస్తున్న ఈ రోజుల్లో చదువు కోసం వెళ్లిన ముగ్గురు అమ్మాయిలు ఓ కిరాతకుడి చేతిలో బలయ్యారు. సరైన రవాణా వసతి లేకున్నా.. తమ కుమార్తెలను చదువు కోసం పొరుగున ఉన్న గ్రామాలకు పంపించారు ఆ పేద కుటుంబాలు. కానీ లిఫ్ట్‌ ఇచ్చే పేరుతో ఓ రాక్షసుడు ఆ బాలికలపై ఘోరానికి ఒడిగట్టాడు. హాజీపూర్‌కి చెందిన ఇద్దరు, మైసిరెడ్డిపల్లికి చెందిన మరో బాలికపై హాజీపూర్‌కి చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసి తన వ్యవసాయ బావిలోనే పూడ్చిపెట్టిన విషయంలో కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించింది. రాజధానికి శివారునే ఉన్న బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ మీదుగా భువనగిరి వరకు బస్సు సౌకర్యం లేకపోవడంతోనే ముగ్గురు బాలికలు బలైపోయారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.

స్పెషల్‌ క్లాసులకు వెళ్లి.. 
హాజీపూర్‌కి చెందిన పాముల నర్సింహా, నాగమణి దంపతుల కుమార్తె(14) మేడ్చల్‌ జిల్లా కీసర మండలంలోని సెరినిటీ మోడల్‌ స్కూల్‌ లో టెన్త్‌ చదువుతోంది. ఆమె గతేడాది ఏప్రిల్‌ నెల 25న పాఠశాలలో ప్రత్యేక తరగతులకు వెళ్లి సాయంత్రం 3 గంటలు దాటినా ఇంటికి చేరుకోలేదు. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 2019 మార్చి 6 నుంచి కనిపించకుండా పోయిన హాజీపూర్‌కే చెందిన మరో బాలిక(18) మేడ్చల్‌ జిల్లా కీసర సమీపంలోని కేఎల్‌ఆర్‌ కాలేజీలో బీకామ్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ ఇద్దరు బాలికలనూ  శ్రీనివాస్‌రెడ్డి లిఫ్ట్‌ ఇస్తానని నమ్మించి అత్యా చారం, హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో ఉరిశిక్ష పడింది.

సాక్షి కథనంతో తెరపైకి మరో కేసు 
మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆరో తరగతి చదువుతున్న బాలిక (11) 2015లో అదృశ్యమైంది. ఈ మిస్సింగ్‌ కేసులో పోలీసులు నాలుగేళ్లుగా ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. 2019 ఏప్రిల్‌ 29న ‘సాక్షి’దినపత్రికలో ఆ బాలిక మిస్సింగ్‌పై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన పోలీసులు కస్టడీలో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని విచారించగా, ఆ బాలికనూ తానే పొట్టన పెట్టుకున్నట్లు ఒప్పుకొన్నాడు.

పానం నిమ్మలమైంది..
పేద కుటుంబానికి చెందిన నేను కూతురిని చదివించి ఉద్యోగం చేసే స్థాయికి తీసుకొద్దామంటే శ్రీనివాస్‌రెడ్డి తన కూతురు ఊపిరి తీసి నా ఆశలు ఆవిరి చేసిండు. శ్రీనివాస్‌రెడ్డికి బతికే హక్కు లేదు. కోర్టు తీర్పుతో పానం నిమ్మలమైంది. వాయిదాలు లేకుండా తొందరగా ఉరి తీసి మా పిల్లల పానాలు తీసిన బావిలోనే సైకోను పాతి పెట్టాలి. అప్పుడే పోకిరీలకు కనువిప్పు కలుగుతుంది.  – తిప్రబోయిన మల్లేశ్, బాలిక తండ్రి 

మరిన్ని వార్తలు