ఊపిరిపీల్చుకున్న హాజీపూర్‌

7 Feb, 2020 02:25 IST|Sakshi
మృతురాలి తల్లి నాగలక్ష్మికి స్వీట్‌ తినిపిస్తున్న గ్రామస్తురాలు 

సైకో శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేయడంపై సంబరాలు

స్వీట్ల పంపిణీ.. కొవ్వొత్తుల ర్యాలీ 

బొమ్మలరామారం: హాజీపూర్‌ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేసిన నేపథ్యంలో ఇన్నాళ్లు ఉత్కంఠగా ఎదురుచూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కంటతడిపెడుతూ తమ పిల్లల ఉసురు తగిలిందని బాధితకుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు బాణసంచా కాల్చారు. పలువురు మహిళలు స్వీట్లు తినిపించుకుంటూ కనిపించారు.

ఉదయం నుంచి ఎదురుచూపులు 
సైకో శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు ఏ శిక్ష వేస్తుందో నని గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు ఉదయం నుంచి ఎదురుచూశారు. ఉదయం 6 గంటల నుంచే గ్రామపంచాయతీ ఆవరణకు చేరుకున్న బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు ప్లకార్డులతో బైఠాయించారు. మధ్యాహ్నం నేరం రుజువైందని జడ్జి చెప్పినట్లు తెలియడంతో కాసింత ఉపశమనం పొందారు. నిందితుడి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష పడితేనే తమ పిల్లల ఆత్మలకు శాంతి కలుగుతుందని, లేకుంటే తమకు అప్పగిస్తే తగిన శాస్తి చేసి ఇంకెవరూ ఆడపిల్లల జోలికి వెళ్లకుండా శ్రీనివాస్‌రెడ్డికి శిక్ష విధిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఉరిశిక్ష వేసినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు. ‘మా చెల్లిని చెరిచి చంపిన సైకోకు సరైన శిక్ష పడింది. ఇప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉంది’అని ఓ బాలిక సోదరి మీనా ఆనందభాష్పాలు రాల్చడం అక్కడున్న వారి మనస్సు చలింపజేసింది. రాత్రి గ్రామస్తులు ముగ్గురు బాలికల ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు.

ఉరితీసిన రోజే సంతృప్తి
కోర్టు తీర్పుతో మాకు ఊరట లభించింది. నిందితుడికి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడంపై సంతోషంగా ఉంది. శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీసిన రోజే నిజమైన సంతృప్తి ఉంటుంది. నా కూతురును చిత్రవధ చేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లే అతడిని కూడా చిత్రహింసలకు గురిచేసి చంపాలి. ఉన్న ఒక్క కూతురును పోగొట్టుకుని అనునిత్యం తన జ్ఞాపకాలతో బతుకుతున్నాం. శ్రీనివాస్‌రెడ్డికి పడిన శిక్షతోనైనా ఆడపిల్లల జోలికి వెళ్లేవారికి గుణపాఠంగా మారుతుంది. ఉరిశిక్ష పడటంతో మా పిల్లల ఆత్మలు శాంతించాయి. – పాముల నాగలక్ష్మి, బాలిక తల్లి

మరిన్ని వార్తలు