పాల మార్కెటింగ్‌లోకి హాకా

5 Aug, 2018 00:41 IST|Sakshi

అంగన్‌వాడీలకు టెట్రా ప్యాక్‌ పాల సరఫరా

విజయ సహా ఇతర సహకార డెయిరీల నుంచి కొనుగోలు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ వ్యవసాయ సహకార సంఘం (హాకా) పాల వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు నిర్వహి ంచిన ఈ ప్రభుత్వ వ్యాపార సంస్థ.. ఇకపై అంగన్‌ వాడీ కేంద్రాలకు పాలు సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేసింది. సెప్టెంబర్‌ నుంచి కేంద్రాలన్నింటి కీ టెట్రా ప్యాక్‌ పాలు సరఫరా చేయనుంది. ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖతో అవగాహన కుదుర్చు కుంది. నెలకు 15 లక్షల లీటర్ల టెట్రా ప్యాక్‌ పాలను అందజేయనున్నట్లు హాకా ఎండీ సురేందర్‌ తెలిపారు.

ప్రైవేటు ఏజెన్సీలు పాలను సరిగా సరఫరా చేయకపోవడంతో మార్కెటింగ్, సరఫరాను హాకాకు ప్రభుత్వం అప్పగించినట్లు తెలు స్తోంది. పాలను సహ కార డెయిరీల నుంచే కొనుగోలు చేయనున్నారు. ప్రధానంగా విజయ డెయిరీ నుంచి కొనుగోలు చేస్తారు. వారి సామర్థ్యానికి మించి అవసరమైతే ఇతర సహకార, ప్రైవేటు డెయిరీల నుంచీ కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.

35,000 అంగన్‌వాడీలకు: రాష్ట్రంలోని 35,000 అంగన్‌వాడీ కేంద్రాలకు హాకా ద్వారా పాలు సరఫరా చేయనున్నారు. రోజూ అన్ని కేంద్రాలకు పాల సరఫరా సాధ్యం కానందున 3 నెలల పాటు నిల్వ ఉండే టెట్రా ప్యాక్‌ పాలను ఎంచుకున్నామని అధికారులు పేర్కొన్నారు. తమకున్న యంత్రాంగం ద్వారా అన్ని కేంద్రాలకు 15 రోజులకోసారి పాలు సరఫరా చేస్తామని, ఇందుకుగాను కొంత రుసుము వసూలు చేస్తామన్నారు. ఆ ప్రకారం హాకాకు ఏడాదికి రూ.కోటి వరకు లాభం వచ్చే అవకాశముంది.  

విజయకు మేలు..!
హాకా పాల విక్రయాలు చేపడితే విజయ డెయిరీకి మరింత మేలు జరుగుతుందని భావిస్తున్నారు. విజయకు రోజూ దాదాపు 4 లక్షల లీటర్ల పాలు రైతులు పోస్తున్నారు. అందులో రెండున్నర లక్షలే విక్రయాలు జరుగుతున్నాయి. మిగిలిన పాలతో పాల పొడి, వెన్న తదితర ఉత్పత్తులు తయారు చేస్తున్నారు.

వాటిని అమ్ముకోలేక డెయిరీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. హాకా 15 లక్షల లీటర్ల పాల సరఫరా చేయనుండటంతో విజయకు మంచి మార్కెట్‌ లభించినట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు. త్వరలో డెయిరీ యాజమాన్యంతో చర్చించి  ఒప్పందం చేసుకునే అవకాశముంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు