ఆస్తుల పరిరక్షణలో భేష్

6 Jul, 2014 01:13 IST|Sakshi
ఆస్తుల పరిరక్షణలో భేష్

- సీఐఎస్‌ఎఫ్ ట్రెయినింగ్ సెక్టార్ ఐజీ అనిల్‌కుమార్
- హకీంపేట్ సీఐఎస్‌ఎఫ్‌లో 62 మందికి శిక్షణ
- కేంద్ర అగ్నిమాపక సిబ్బంది పాసింగ్ అవుట్ పెరేడ్

శామీర్‌పేట్ రూరల్: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల పరిరక్షణకు కేంద్ర అగ్నిమాపక సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారని సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) ట్రెయినింగ్ సెక్టార్ ఐజీ అనిల్‌కుమార్ అన్నారు. శనివారం మండలంలోని హకీంపేట్ పరిధిలోని సీఐఎస్‌ఎఫ్‌లో అగ్నిమాపక కానిస్టేబుల్, డ్రైవర్, పంప్ ఆపరేటర్ల 12వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పెరేడ్ (పీఓపీ) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనిల్‌కుమార్ మాట్లాడుతూ విపత్కాలంలో అగ్నిమాపక సిబ్బంది ఎంతగానో కష్టించి దేశ ప్రజలకు మంచి సేవలందిస్తున్నారని ప్రశంసించారు.

ఇటీవల రసాయన పరిశ్రమల్లో  ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, శిక్షణతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడాలని సూచించారు.  శిక్షణలో ప్రతిభ కనపర్చిన జవాన్లకు బహుమతులు అందజేశారు. ముందుగా శిక్షణ పొందిన సిబ్బంది నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 62 మంది ఇందులో శిక్షణ పొంది పాసింగ్ అవుట్ పెరేడ్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఫైర్ ట్రెయినింగ్ ప్రిన్సిపాల్ భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు