ఉపాధి భలే బాగుంది

18 May, 2019 09:14 IST|Sakshi

సాక్షి,సిటీబ్యూరో: రంజాన్‌ మాసం అంటే నగర ప్రజలకు నోరూరించేది హలీం మాత్రమే. ప్రస్తుతం సిటీలో ఐదు వేలకు పైగా హలీం దుకాణాలు వెలిశాయి. వీటి నిర్వాహకులు హోటల్‌లో రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సర్వీస్‌ను అందిస్తున్నారు. హలీం కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారు ఉన్న చోటుకే హలీం అందిస్తున్నారు. తమ దుకాణాల వద్ద ప్రత్యేకంగా పదుల సంఖ్యలో వెయిటర్లను పెట్టి సర్వీస్‌ చేస్తున్నారు. దాంతో ఈ సీజన్‌లో పలు ప్రాంతాల నుంచి వచ్చిన యువకులకు మంచి ఉపాధి దొరికినట్టయింది.

హలీం సెంటర్ల వద్ద సాయంత్ర నుంచి రద్దీ పెరుగుతుంది. దాంతో కౌంటర్‌ వద్దకు వెళ్లి హలీం తీసుకోవడం సాధ్యం కాదు. హలీం ప్రియులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు ఉన్నచోటుకే ఈ వెయిటర్లు డెలివరీ చేస్తున్నారు. ప్రస్తుతం తాము ఇరవై మందికి పైగా సిబ్బందిని అదనంగా నియమించుకున్నామని కాలికబర్‌ బస్టాండ్‌ పక్కనున్న ‘యా అలీ హోటల్‌’ నిర్వహకుడు మహ్మద్‌ యూనుస్‌ తెలిపారంటే ఈ మాసంలో హోటళ్లు ఎంత రద్దీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

మరిన్ని వార్తలు