సాగును పండుగ చేసేందుకే..

25 May, 2020 04:02 IST|Sakshi
ప్రతిజ్ఞ చేస్తున్న మంత్రి హరీశ్‌ తదితరులు

బడ్జెట్‌లో సగం రైతులకే కేటాయింపు

నియంత్రిత సాగుపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

సాక్షి, మెదక్‌/సిద్దిపేట: వ్యవసాయాన్ని పండుగ చేసేందుకే సీఎం కేసీఆర్‌ నియంత్రిత పంటల సాగు ప్రణాళికను రూపొందించారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగుచేస్తే రైతులకు మరింత లాభం వస్తుందన్న ఉద్దేశంతో నియంత్రిత పంటల సాగుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఆదివారం మెదక్‌ పట్టణంలో జరిగిన నియంత్రిత పంటల సాగు అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఏడాదికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, దాదాపు బడ్జెట్‌లో సగం అన్నదాతలకే వెచ్చిస్తుందని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగ అని, దాన్ని మానుకొని రైతులు కంప్యూటర్‌ నేర్చుకోవాలన్న మాటలను ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.

రాష్ట్రంలో మొదటి విడత కింద రూ.1,200 కోట్లు రుణ మాఫీ చేస్తామని, ఇందులో భాగంగా ఇప్పటికే రూ.25 వేల రుణాలున్న రైతులకు మాఫీ చేశామని తెలిపారు. అలాగే రూ.1 లక్ష రుణం ఉన్న రైతులకు విడతల వారీగా చేస్తామని పేర్కొన్నారు. రైతుబంధు కోసం రూ.10 వేల కోట్లు వెచ్చించామని, జూన్‌ 10వ తేదీ వరకు రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేస్తామని తెలిపారు. రైతులు దొడ్డు రకం సాగు తగ్గించి, సన్న రకం వరి సాగు చేయాలని, ఇందుకు క్వింటాలుకు రూ.2,000 నుంచి 2,100 వరకు చెల్లించి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. అంతకు ముందు నిజాంపేట మండలం నస్కల్‌ గ్రామంలో నియంత్రిత వ్యవసాయం చేస్తామని మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో రైతులు ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు.

సూచించిన పంటే వేస్తాం..
కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లాలోని 45 గ్రామాల రైతులు పంట మార్పిడి, నియంత్రిత సాగును తు.చ. తప్పకుండా పాటిస్తామని ఆదివారం ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఈ మేరకు ఆయా గ్రామాల వ్యవసాయ శాఖ అధికారులకు తీర్మానాల కాపీలను అందజేశారు. జిల్లా రైతులను మంత్రి హరీశ్‌రావు అభినందించారు.

>
మరిన్ని వార్తలు