15 నుంచి ఒంటి పూట బడులు

13 Mar, 2018 03:29 IST|Sakshi

     నిర్ణయించిన పాఠశాల విద్యాశాఖ 

     జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: వేసవి నేపథ్యంలో ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని వెల్లడించింది. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న ఉన్నత పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలను కొనసాగించాలని పేర్కొంది. ఈ మేరకు జిల్లాల విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

ఒంటి పూట బడులు ఈ విద్యా సంవత్సరంలో చివరి పని దినం ఏప్రిల్‌ 12 వరకు కొనసాగుతాయి. ఏప్రిల్‌ 13 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులుంటాయి. జూన్‌ 1న తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. జూన్‌ 2న పాఠశాలల్లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తారు. అయితే జూన్‌లో కూడా ఎండల తీవ్రత ఉంటే.. ఆ నెల 15 వరకు ఒంటి పూట బడులను కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. 

‘ఆప్షనల్‌ హాలీడే’అందరికీ.. 
ఆప్షనల్‌ హాలీడే రోజుల్లో ఉన్నత పాఠశాలలను మూసివేయకుండా 30 శాతం మంది టీచర్లే వాటిని వినియోగించుకోవాలని, మిగతా టీచర్లు పాఠశాలను కొనసాగించాలని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ సవరించింది. పాఠశాల మొత్తానికి ఆప్షనల్‌ హాలీడే వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో    ఆప్షనల్‌ హాలీడే రోజుల్లో పాఠశాలతోపాటు టీచర్లకు సెలవు వర్తిస్తుంది.  

మరిన్ని వార్తలు