భయమే శబ్దమ్‌..దెయ్యమే థీమ్‌!

2 Nov, 2019 09:56 IST|Sakshi

సిటీలో ‘హాలోవీన్‌’ సందడి

పెరుగుతున్న ‘డెవిల్‌’ ఈవెంట్స్‌

‘నంది కొండ వాగుల్లోన..నల్లతుమ్మ నీడల్లో.... నీడల్లే ఉన్నా..నీతో వస్తున్నా నీ భరతం పడతా నిను ఎత్తుకుపోతా’ అంటూ సినీ ప్రేక్షకులకు మాత్రమే పరిమితమైన పాటలు ఇప్పుడు నగరవాసుల నిజజీవితంలోకి కూడా వచ్చేశాయి. విందు వినోదాలు, ఆట పాటలతో మాత్రమే నైట్‌ పార్టీలు నిర్వహించడం నిన్నటి మాట. భయపెట్టి, భయపడడంలో ఆనందాన్వేషణ చేయడం నేటి బాట. ఈ ట్రెండ్‌కి ఊతమిస్తోంది హాలోవీన్‌ థీమ్‌

సాక్షి, సిటీబ్యూరో: సిటీకి ఈవెంట్‌ మేనేజర్స్‌ కొత్త కాదు. అయితే తొలి ఈవెంట్‌నే డెవిల్‌ డెకరేషన్‌తో మొదలుపెట్టడం చూస్తే సిటీలో డెవిల్‌ జోష్‌ ఎలా ఉందో తెలుస్తుంది. సిటీ యువతి వినమ్ర రాజ్‌ కృష్ణ మెరక్‌ ఈవెంట్స్‌కు రూపకల్పన చేసింది. తన సంస్థ తరపున తొలి ఈవెంట్‌గా సిటీయూత్‌కి క్రేజీగా మారిన హాలోవీన్‌ థీమ్‌ను ఆమె ఎంచుకోవడం విశేషం. హార్నివాల్‌ పేరుతో ఎవర్‌ ఈవెంట్స్‌తో కలిసి ఆమె గత గురువారం దాదాపు 100 ఏళ్ల నాటి పురాతనభవనం రాక్‌ క్యాజిల్‌లో సక్సెస్‌ఫుల్‌గా హాలోవీన్‌ నైట్‌ నిర్వహించింది. డీజే మ్యూజక్, డ్యాన్స్‌ఫ్లోర్, లైవ్‌ బ్యాండ్, ర్యాపర్స్, ఫుడ్‌ స్టాల్స్‌...తో హార్నివాల్‌ హోరెత్తింది.

దెయ్యం వెనుక కథ ఇదీ...
పోటా పోటీగా నిను మించిన పిశాచిని నేనే అని పరస్పరం భయపెడుతూ సాగుతాయీ హాలోవీన్‌ పార్టీస్‌. చనిపోయిన వారి ఆత్మల్ని గౌరవించడానికి, అదే సమయంలో అవి తమనేమీ చేయలేవని చెప్పడం...ఈ వేడుకకు మూలమట. అందుకని ప్రత్యేకంగా ఒక రోజున రాత్రి సమయంలో తిరిగే భూతప్రేతాల్ని భయపెట్టడానికి భయంకరమైన కాస్ట్యూమ్స్‌ వేసుకునేవారట.  హాలోవీన్‌నైట్‌ పుట్టుక వెనుక కథల్లో ఎక్కువ మంది నమ్మే కథ ఇది. కాలక్రమంలో ఇదొక కాలక్షేపం కాస్ట్యూమ్స్‌పార్టీలా మారిపోయింది. ఖండాంతరాలు దాటి సిటీకి కూడా వచ్చేసింది.  

ఫన్‌ అండ్‌ ఫియర్‌
విందు, వినోదంతో పాటు కాస్తంత భయం, ఆశ్చర్యం, వంటివన్నీ మిళితమై ఉండే థీమ్‌ కావడంతో ఇప్పుడు యూత్‌లో హాలోవీన్‌ థీమ్‌కి బాగా క్రేజ్‌ ఉంది. అయితే హాలోవీన్‌ పార్టీలు నిర్వహించడం అంత ఈజీ కాదు. ఏ మాత్రం భయపెట్టలేకపోయినా మరీ ఎక్కువ భయపెట్టినా కష్టమే. తగిన మోతాదులో ఫన్‌ అండ్‌ ఫియర్‌ బ్యాలెన్స్‌ చేసుకోవాలి.  – వినమ్ర రాజ్‌ కృష్ణ, సయ్యద్‌ ఇంతిసారుద్దీన్‌

భయమే..జయం

ఒకప్పుడు కేవలం అక్టోబరు 31వ తేదీన మాత్రమే హాలోవీన్‌ పార్టీల సందడి ఎక్కువగా కనిపించేది. అయితే వీటికి మంచి స్పందన వస్తుండడంతో రానురాను..రెగ్యులర్‌గా జరిగే పార్టీలకు కూడా ఈ థీమ్‌ జోడిస్తున్నారు. ఈ థీమ్‌తో జరిగే పార్టీస్‌లో వెల్‌కమ్‌ చెప్పే వ్యక్తి నుంచి వీడ్కోలు పలికేవారి వరకూ అంతా దెయ్యాలు, భూతాలు, మంత్రగాళ్లు, రాబంధులు, వాంపైర్స్, ఏంజెల్స్‌...గెటప్స్‌తో సిద్ధమవుతారు. దీని కోసం ప్రత్యేకంగా మాస్క్‌లు, టాటూలు ఉంటాయి. వీటికి హాలోవీన్‌ బార్బీ ఫ్రైడే, సన్‌డౌన్‌ పూల్‌పార్టీ, థ్రిల్లర్‌ వంటి పేర్లున్నాయి.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు