విద్యాశాఖాధికారి సంచలనం

14 Mar, 2014 04:26 IST|Sakshi

ఇటీవల కాలంలో సంచలనాలకు వేదికగా మారిన జిల్లా విద్యాశాఖమళ్లీ వార్తల్లోకెక్కింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన
 ఉపాధ్యాయులను సస్పెన్షన్ చేస్తూ వారిపట్ల కఠినంగా వ్యవహ రిస్తున్నారని పేరున్న జిల్లా విద్యాశాఖాధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారన్న వార్త... ఉపాధ్యాయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

తనను వేధింపులకు గురి చేయడం వల్లే ఏసీబీ అధికారులను ఆశ్రయించానని బాధితుడు చెబుతుంటే.. తాను అసలు అతనితో మాట్లాడనేలేదని డీఈఓ అంటున్నారు.

 జిల్లా విద్యాశాఖ అధికారి జగదీశ్ రూ. 30వేలు లంచంగా తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం.. జిల్లాలో సంచలనం రేకేత్తించింది. మరోవైపు డీఈఓ కార్యాలయంలో కలకలం రేపింది. డీఈఓ ఇంట్లో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులకు రూ.10 లక్షల నగదు దొరకడం మరింత సంచలనం కలిగించింది. జిల్లా విద్యాశాఖాధికారి ఏసీబీకి పట్టుబడడం, ఇంత పెద్ద ఎత్తున
 నగదు లభించడం ఇదే ప్రథమమని సమాచారం.

2005లో ఎస్సెస్సీ పరీక్షల సందర్భంగా ఏసీబీ అధికారులు పలు జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు జరిపిన సందర్భంగా డీఈఓ కార్యాలయంలోని నలుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని సస్పెండ్ చేసిన చరిత్ర ఉంది.
 

ఏసీబీని ఆశ్రయించిన హెచ్‌ఎం నిరంజన్‌రెడ్డి
 

డీఈఓ ఎ.జగదీశ్ గత డిసెంబర్ 26వ తేదీన కేతేపల్లి మండలం బండపాలెం ప్రాథమిక పాఠశాలను సందర్శించి వివిధ కారణాలతో ప్రధానోపాధ్యాయుడు నిరంజన్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. రెండు నెలల పాటు డీఈఓ కార్యాలయం, ఇంటి చుట్టూ తిరిగిన బాధితుడు చివరకు ఈ నెల 5వ తేదీన తిరిగి పోస్టింగ్ తెచ్చుకుని విధుల్లో చేరాడు. సస్పెన్షన్ ఎత్తివేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నా పెండింగ్ ఎంక్వైరీ అంటూ మెలిక పెట్టడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం రూ.30 వేలు అందజేయగా డీఈఓ నగదును తీసుకుంటూ పట్టుబడ్టాడు. వెంటనే ఏసీబీ అధికారులు కెమికల్స్ కోటింగ్‌తో అందజేసిన నోట్లను, వాటి నం బర్లను సరిచూసుకుని నిర్ధారణ చేసుకున్నారు. కెమికల్‌తో ఉన్న నోట్లు ముట్టుకోవడంతో ఆయన చేయి గులాబీగా మారింది.

 రూ.10 లక్షల నగదు స్వాధీనం
 

దాడుల అనంతరం ఏసీబీ అధికారులు నల్లగొండ పట్టణం పద్మావతి కాలనీలో ఉన్న డీఈఓ ఇంట్లో సోదాలు జరిపారు. వారికి అక్కడ రూ.10లక్షల నగదు లభించింది. వీటిలో రూ.8 లక్షలు ఒకటే బండిల్‌లో ఉంది. మరో 10 కవర్లలో ఉన్న నగదును తీసి లెక్కించగా రూ. 2 లక్షల దాకా ఉన్నట్లు గుర్తించారు. ఈ కవర్లపై ఒకరిద్దరు ఉపాధ్యాయుల పేర్లు, కొన్ని పాఠశాలల పేర్లు ఉన్నాయి. ఏసీబీ అధికారులు డీఈఓ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహిం చారు. ముందుగా కొందరు అధికారుల నుండి సమాచారం రాబట్టిన అనంతరం డీఈఓ ఛాంబ ర్‌లోని ముఖ్యమైన ఫైల్స్‌ను పరిశీలించారు.

 రెండేళ్లలో ఇంత మార్పా...

 2012 ఏప్రిల్ 09వ తేదీన ఎ.జగదీశ్ జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. మొదటి సంవత్సరమంతా హల్‌చల్ సృ ష్టించడంతో పాటు పలువురిపై సస్పెన్షన్ వేటు వేశారు. విద్యాశాఖను ఓ గాడిన పెట్టాడని మంచి పేరొచ్చింది. నిజాయితీ పరుడనే పేరును సైతం పొందగలిగారు. కానీ ఒక్కసారిగా ఏసీబీ కేసుతో అందరి ఊహాలు, అంచనాలు తలకిందులయ్యాయి. బయటికి ఓ రకంగా లోపల మరో రకంగా వ్యవహరించాడా, నిజాయితీ అంతా ఉట్టిదేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

 2005లో ఏసీబీ ట్రాప్‌లో నలుగురు సిబ్బంది...

 ఎస్సెస్సీ నామినల్ రోల్స్ సమర్పించే సందర్భంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో 2005లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో టైపిస్టు డి.రవీందర్, సీనియర్ అసిస్టెంట్లు నరేందర్‌బాబు, రషీద్, పరీక్షల అసిస్టెంట్ కంట్రోలర్ నారాయణస్వామిలను బాధ్యులుగా గుర్తించి ఏసీబీ కేసు నమోదు చేశారు. తర్వాత దాదాపు 9 ఏళ్లకు మరోమారు డీఈఓ కార్యాలయం ఏసీబీ రికార్డుల్లోకి ఎక్కింది.

 వివాదాలకు కేంద్ర బిందువుగా డీఈఓ కార్యాలయం

 2013 నవంబర్ 27న డీఈఓ కార్యాలయానికి గుండెకాయలాంటి ఎస్టాబ్లిస్‌మెంట్ సెక్షన్ అనుమానాస్పద స్థితిలో దగ్ధమైంది. ఈ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. అంతకు ముందు 2006, 2008 డీఎస్సీల్లో తప్పుడు కుల ధ్రువీకరణ ప్రతాలతో ఉద్యోగాలు పొందారనే కారణంతో 2013లో 12మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ఈ ఫైళ్లు కూడా దహనమయ్యాయి. 2009లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ల సందర్భంగా నకిలీ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు పొందారనే అంశంపై కూడా విచారణ సాగుతుంది. గత కొంతకాలంగా డీఈఓ కార్యాలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.
 

ఇన్‌చార్జ్ డీఈఓగా మదన్‌మోహన్...?
 

డీఈఓ జగదీశ్ ఏసీబీ కేసులో పట్టుబడడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు తప్పేలా లేదు. దీంతో ఇన్‌చార్జ్ డీఈఓగా ప్రస్తుతం భువనగిరి డిప్యూటీ డీఈఓగా పనిచేస్తున్న ఎ.మదన్‌మోహన్‌ను నియమించే అవకాశం ఉంది. జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న రెగ్యులర్ డిప్యూటీ డీఈఓ ఆయనొక్కరే ఉన్నారు. 2011 మార్చి 1 నుంచి 2012 ఏప్రిల్ 8వ తేదీ వరకు ఆయన ఇన్‌చార్జి డీఈఓగా పనిచేశారు.

 సస్పెండ్ చేశాననే కక్షతో చేశారు : డీఈఓ

 సస్పెండ్ చేశాననే కక్షతో ఏసీబీ కేసులో ఇరికించాడని డీఈఓ జగదీష్ తెలిపారు. గురువారం తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. తనకు లంచాలు తీసుకునే అలవాటు లేదని, దానికి వ్యతిరేకమన్నారు. నిజాయితీగా పనిచేస్తుండడం కొందరికి కంటగింపుగా మారిందన్నారు. తనకు ప్రాణభయం ఉందని గతంలోనే పోలీసులను ఆశ్రయించానని గుర్తు చేశారు. తనను బదిలీ చేయించడానికి కొందరు ప్రయత్నించారని అన్నారు. గురువారం ఉదయం బండపాలెం ప్రధానోపాధ్యాయుడు నిరంజన్‌రెడ్డి ఇంటిలోకి వచ్చి నెయ్యిబాటిల్ ఇవ్వబోతే తిరస్కరించానన్నారు. అనంతరం జేబులోంచి నగదు తీసి జేబులో కుక్కేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నానన్నారు. చివరకు చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నించగా వాటిని నెట్టేశానన్నారు. నిరంజన్‌రెడ్డితో ఏనాడూ ఫోన్‌లో మాట్లాడలేదన్నారు. కాల్‌డేటాలో తనఫోన్ నంబర్లున్నాయని ఏసీబీ అధికారులు అంటున్నారని, మీటింగ్‌లో ఉన్నపుడు ఫోన్‌లు క్యాంప్‌క్లర్క్ వేణు వద్ద ఉంటాయని తెలిపారు.

>
మరిన్ని వార్తలు