బడ్జెట్‌లో చేనేతకు తగిన ప్రాధాన్యం

4 Mar, 2017 02:01 IST|Sakshi
బడ్జెట్‌లో చేనేతకు తగిన ప్రాధాన్యం

ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌
సాక్షి, హైదరాబాద్‌: త్వరలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో చేనేత రంగానికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్‌ను మంత్రి సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల్లో వినియోగానికి చేనేత వస్త్రాలను వీలైనంతగా కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. నేతన్నలని ఆదుకునేందుకు బీమా సౌకర్యంతో పాటు వారి సంక్షేమానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

నూలు కొనుగోలుకు 20 శాతం సబ్సిడీ, అధునాతన టెక్నాలజీతో నడిచే పెడల్‌ లూమ్స్‌ అందిస్తున్నామన్నారు. నేత వస్త్రాలకు టెస్కో ద్వారా మార్కెటింగ్‌ సౌకర్యం ఉందన్నారు. చేనేత సంఘాలకు అందిస్తున్న త్రిఫ్ట్‌ ఫండ్‌లో 20 శాతం సభ్యులు కడితే మిగతా 80 శాతం ప్రభుత్వమే జమ చేస్తుందన్నారు. సొసైటీలకు వర్క్‌షెడ్ల నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. పావలా వడ్డీతో క్యాష్‌ క్రెడిట్‌ ఇప్పటికే అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

>
మరిన్ని వార్తలు