ఒక్క ఏడాది.. 13 వేల పాస్‌పోర్టులు..!

21 Feb, 2018 02:46 IST|Sakshi

      హన్మకొండ తపాలా కార్యాలయం రికార్డు

     మహబూబ్‌నగర్‌ కేంద్రంలోనూ మంచి ఫలితాలు

సాక్షి, హైదరాబాద్‌: పన్నెండు నెలలు.. 13 వేల పైచిలుకు పాస్ట్‌పోర్టుల జారీ.. హన్మకొండ తపాలా కార్యాలయం సాధించిన రికార్డు ఇదీ. పోస్టాఫీసులో పాస్‌పోర్టులకు అనూహ్య స్పందన రావడం కేంద్రం దృష్టిని ఆకర్షించింది. దీంతో రాష్ట్రంలోని పూర్వపు జిల్లా కేంద్రాలన్నింటిలోని తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. మార్చి 4 లోపు మిగతా చోట్ల ప్రారంభించేందుకు పచ్చజెండా ఊపటంతో తెలంగాణ తపాలా సర్కిల్‌ చకచకా ఏర్పాట్లు చేస్తోంది.  

ఏడాది క్రితం ప్రయోగాత్మకంగా.. 
పాస్‌పోర్టులు స్థానికంగానే జారీ చేసేందుకు కేంద్రం తపాలా కార్యాలయాల్లో అనుబంధ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రయోగాత్మకంగా గత మార్చిలో హన్మకొండ ప్రధాన తపాలా కార్యాలయంలో పాస్‌పోర్టుల జారీని ప్రారంభించింది. తదుపరి మహబూబ్‌నగర్‌ పోస్టాఫీసులోనూ మొదలుపెట్టింది. ఈ 2 చోట్లా పాస్‌పోర్టుల కోసం జనం ఎగబడటంతో ఇది విజయవంతమైంది. హైదరాబాద్‌లో ప్రధాన పాస్‌పోర్టు కేంద్రంతోపాటు మరికొన్ని సేవా కేంద్రాలు ఉన్నందున ఇక్కడ పోస్టాఫీసులకు అనుమతి ఇవ్వలేదు. కరీంనగర్, నిజామాబాద్‌లో టీసీఎస్‌ సాయంతో పాస్‌పోర్టు విభాగమే కేంద్రాలను ఏర్పాటు చేసినందున మిగతా జిల్లాల్లోని తపాలా కార్యాలయాల్లో వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.  

పక్షం రోజుల్లో ఇంటికి పాస్‌పోర్ట్‌ 
పూర్వపు వరంగల్‌ జిల్లా పరిధి మొత్తానికి హన్మకొండ పోస్టాఫీసును కేంద్రంగా మార్చిలో ఏర్పా టు చేశారు. తొలి నెలలో 120 పాస్‌పోర్టులే జారీ అయ్యాయి. ఏప్రిల్‌లో 784 పాస్‌పోర్టులు జారీ చేసింది. ఆ తర్వాత ఇది రెట్టింపైంది. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటు ఉండటం.. అరగంటలోనే పూర్తవుతుండటంతో పోస్టాఫీసులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రక్రియ పూర్తయి న çపక్షం రోజుల్లో ఇంటికి పాస్‌పోర్టు వస్తోంది. 

మహబూబ్‌నగర్‌లోనూ సక్సెస్‌.. 
మహబూబ్‌నగర్‌ పట్టణంలోని పోస్టాఫీసులో నిత్యం సగటున 40 పాస్‌పోర్టుల వెరిఫికేషన్‌ జరుగుతోంది. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 4 వేల పాస్‌పోర్టులు జారీ అయినట్టు అక్కడి తపాలా సూపరింటెండెంట్‌ శ్రీహరి పేర్కొన్నారు. దీన్ని మహబూబ్‌నగర్‌ కొత్త జిల్లా పరిధికే పరిమితం చేయడంతో.. పూర్వపు జిల్లా పరిధి మొత్తానికి విస్తరించాలని ప్రతిపాదనలు పంపినట్టు ఆయన వెల్లడించారు. ఖమ్మం, ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్లగొండల్లో మార్చి 3 లోపు పాస్‌పోర్టు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తపాలాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.  

విద్యార్థులు వినియోగించుకుంటున్నారు 
ఇంటి వద్ద ఉండే పాస్‌పోర్టు పొందిన అనుభూతిని దరఖాస్తుదారులు పొందుతున్నారు. విద్యార్థులు దీనిని బాగా వినియోగించుకుంటున్నా రు. గతంతో పోలిస్తే పాస్‌పోర్టు కేంద్రాల ఏర్పాటు తర్వాత తపాలా సేవలను వినియోగించుకుంటున్నవారి సంఖ్య పెరిగింది.  
–హన్మకొండ సూపరింటెండెంట్‌ ఎం.శేషగిరి 

మరిన్ని వార్తలు