మేధావుల విడుదలకు పోరాడాలి: హరగోపాల్‌ 

24 Jun, 2019 01:54 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రజాస్వామ్య మేధావులు వరవరరావు, సాయిబాబా సహా 11 మంది విడుదల కోసం మేధావులు, విద్యావంతులు, ప్రజా సంఘాలు రాజీ లేని పోరాటం చేయాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ పిలుపునిచ్చారు. ఉద్యమించే హక్కుపై అప్రకటిత ఎమర్జెన్సీ (1975 జూన్‌ 25 ఎమర్జెన్సీ విధించిన సందర్భంగా), ఉపా చట్టాన్ని రద్దు చేయడం, ప్రజాస్వామికవాదుల అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా రాజకీయ ఖైదీల విడుదల కోసం పౌరహక్కుల సంఘం, టీఎస్, ఏపీ ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీడిత ప్రజలు విముక్తి చెంది సమసమాజం రావాలని కోరుకుంటూ ఉన్నతమైన విలువల కోసం పోరాడుతున్న మేధావులను జైళ్లలో పెట్టి వారి గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు. సాయిబాబా, వరవరరావు తదితరులపై ఏ నేరాలూ లేవని.. ఆయుధాలతో చర్యను నిషేధించారే కానీ మావోయిస్టు రాజకీయాలను కాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కృషి చేస్తుండటం వల్లే వరవరరావు సహా 11 మందిని జైలులో పెట్టారని ఆరోపించారు.

అనారోగ్యంతో నిస్సహాయ స్థితిలో ఉన్న సాయిబాబా మావోయిస్టు కార్యాకలాపాలను అమలు చేస్తాడా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రాజ్యాంగంపై గౌరవం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్, వీక్షణం సంపాదకులు వేణుగోపాల్, ప్రొఫెసర్‌ ఖాసీం, బహుజన ప్రతిఘటన వేదిక నాయకుడు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు