చివరి ఆయకట్టుకూ నీరందాలి

15 Feb, 2018 04:36 IST|Sakshi
బుధవారం జలసౌథలో నిర్వహించిన సమీక్షలో మంత్రి హరీశ్‌రావు, సీఎస్‌ ఎస్‌కే జోషి

శ్రీరాంసాగర్, సాగర్, నిజాంసాగర్‌లపై హరీశ్‌ సమీక్ష

నీటి నిర్వహణ, భగీరథ అవసరాలపై అధికారులకు సూచనలు

ప్రాజెక్టు పరిధిలోని కాల్వలపై గస్తీకి ఆదేశాలు..

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత రబీలో సాగు నీటి ప్రాజెక్టుల కింద నీటి నిర్వహణను పకడ్బందీగా చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, నిజాంసాగర్‌ ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు సైతం నీరందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మిషన్‌ భగీరథ పథకానికి కేటాయించిన నీటిని జలాశయాల్లో కాపాడుకోవాలని సూచించారు. బుధవారం భారీ ప్రాజెక్టుల కింద నీటి నిర్వహణ, సాధించిన ఆయకట్టు, మిషన్‌ భగీరథ అవసరాలపై సంబంధిత చీఫ్‌ ఇంజనీర్లు, సూపరింటెండింగ్‌ ఇంజనీర్లతో మంత్రి జలసౌధలో సమీక్షించారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కింద రబీలో ఎల్‌ఎండీ ఎగువన 4 లక్షల ఎకరాలకు, ఎల్‌ఎండీ దిగువన 1.15 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ లక్ష్యాలను సాధిస్తూనే మిషన్‌ భగీరథ అవసరాలకు జలాశయాల్లో నీటిని కాపాడుకోవాలని సూచించారు. ప్రాజెక్టు పరిధిలో కాల్వలపై రాత్రి వేళల్లో కూడా గస్తీ నిర్వహించాలన్నారు. అక్రమంగా తూములు, కాల్వలు పగులగొట్టకుండా, గేట్లను ఎత్తివేయకుండా చూడాలని చెప్పారు. అవసరమైతే పోలీసు, రెవెన్యూ అధికారుల సహాయం తీసుకోవాలని సూచించారు.  

19 లక్షల ఎకరాలకు నీరు..
ప్రస్తుతం శ్రీరాంసాగర్‌లో 10 టీఎంసీల నీరు ఉందని చీఫ్‌ ఇంజనీర్‌ మంత్రికి తెలిపారు. మరో నాలుగు తడులకు 4 టీఎంసీల నీరు అవసరమని.. మిగతా 6 టీఎంసీల నీటిని మిషన్‌ భగీరథ అవసరాలను వినియోగిద్దామని చీఫ్‌ ఇంజనీర్‌ అన్నారు. ఏప్రిల్‌ 16న ఎస్సారెస్పీ కాల్వ మూసివేయాలని, మార్చి 20న ఎల్‌ఎండీ కాలువ మూసివేయాలని హరీశ్‌ ఆదేశించారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 32 టీఎంసీలు, సాగర్‌లో 30 టీఎంసీలు మొత్తం కలిపి 62 టీఎంసీల నీటి లభ్యత ఉందని ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ సునీల్‌ తెలిపారు.

ఇప్పటికే 7 తడులకు నీటిని విడుదల చేశామని, మరో నాలుగు తడులకు నీరివ్వాల్సిన అవసముందన్నారు. ఏప్రిల్‌ 5న సాగర్‌ ఎడమ కాలువ తూము మూసివేయాలని హరీశ్‌ సూచించారు. ఈ రబీలో శ్రీరాంసాగర్‌ కింద 6 లక్షల ఎకరాలు, నాగార్జునసాగర్‌ కింద 5 లక్షల ఎకరాలు, నిజాంసాగర్‌ కింద 2 లక్షల ఎకరాలు, మీడియం ప్రాజెక్టుల కింద 6 లక్షల ఎకరాలకు కలిపి మొత్తంగా 19 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.

సీతారామ ప్రాజెక్టుపై సమీక్ష
సీతారామ ఎత్తిపోతలపైనా మంత్రి హరీశ్‌ సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా హాజరయ్యారు. సీతారామ లిఫ్ట్‌ పథకం ఫేజ్‌ –1లో 3 పంప్‌హౌస్‌ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని హరీశ్, తుమ్మల అధికారులను ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని సూచించారు.

సీఎస్‌ జోషికి సన్మానం..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి జలసౌధకు వచ్చిన ఎస్‌కే జోషిని మంత్రి హరీశ్‌ ఘనంగా సన్మానించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీగా, ఇరిగేషన్‌ వ్యవహారాలను పర్యవేక్షించిన జోషి అత్యంత బాధ్యతాయుతంగా పనిచేశారని కొనియాడారు. తన 34 ఏళ్ల సర్వీస్‌లో ఎందరో మంత్రులను చూశానని, కానీ హరీశ్‌ వంటి మంత్రిని చూడలేదని జోషి అన్నారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి మంత్రి పడుతున్న శ్రమను ఆయన కొనియాడారు.  

మరిన్ని వార్తలు