‘కూటమి’కి కేరాఫ్‌ ఎక్కడ?

7 Nov, 2018 02:24 IST|Sakshi

అమరావతిలోనా.. ఢిల్లీలోనా?

గజ్వేల్‌లో నాయీబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు  

గజ్వేల్‌: ‘మహాకూటమిలో సీట్ల లొల్లి తెగుతలేదు.. గాంధీభవన్‌ దగ్గర బందోబస్తు పెట్టుకుండ్రు.. ఈ పంచాయితీ ఎప్పుడు తెగాలే.. ఈ కూటమికి కేరాఫ్‌ ఎక్కడ? అమరావతిలోనా.. ఢిల్లీలోనా? ప్రజలకు చెప్పాల్సిన అవసరముంది. కాంగ్రెస్‌ది ఓ మేనిఫెస్టో.. టీడీపీది ఒక మేనిఫెస్టో.. టీజేఎస్‌ది మరొకటి.. ఎవరి మేనిఫెస్టో అమలు చేస్తరు? దీనికి జిమ్మేదారి ఎవరనేది కూడా తేల్చాలే?’అంటూ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో నిర్వహించిన నాయీబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనానికి మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లతో కలిసి హరీశ్‌రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక విధానం, ఎజెండా లేని ఈ కూటమి డిసెంబర్‌ 11 తర్వాత అడ్రస్‌ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు. టికెట్లు ఇయ్యలేని పరిస్థితిలో ఉన్న ‘కూటమి’గెలవగలదా.. టీఆర్‌ఎస్‌తో పోటీ పడగలదా అని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌తో జరిగే పోటీలో కూటమి నేతలు డిపాజిట్ల కోసం మాత్రమే పోరాడాల్సి వస్తుందన్నారు. ఎన్ని చోట్ల వారికి డిపాజిట్లు గల్లంతవుతాయో అనే విషయం మాత్రమే లెక్క తేలాల్సి ఉందన్నారు. టీఆర్‌ఎస్‌కు వంద సీట్లతో మరోసారి అధికారం ఖాయమని జోస్యం చెప్పారు.

హరీశ్‌పై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: రేవూరి
వరంగల్‌: మంత్రి హరీశ్‌రావుపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. హన్మకొండలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను హరీశ్‌రావుపై మాట్లాడితే.. వాడెవడో రేవూరి ప్రకాశ్‌రెడ్డి అట.. నాలుక కోస్తా అని టీవీ చానళ్లలో మాట్లాడిన మాటల క్లిప్పింగు ఆధారంగా ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్, డీజీపీలను కోరుతామని చెప్పారు. టీఆర్‌ఎస్‌లో జరుగుతున్న అవమానం గురించి హరీశ్‌ ఎవరి దగ్గర చెప్పుకొని బాధపడ్డారో తనకు తెలుసునని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పత్రికలో ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో హరీశ్‌రావు ఫొటోలు, పర్యటన, సమావేశాల ఫొటోలు ఒక్కటి కూడా రాకపోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. మామకు దగ్గరయ్యేందుకు నిజాయితీని నిరూపించుకునేందుకే చంద్రబాబును, టీడీపీని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. 

మరిన్ని వార్తలు