వలస కూలీలకు అండగా ఉంటాం

8 Apr, 2020 02:06 IST|Sakshi

మంత్రి హరీశ్‌రావు భరోసా

బియ్యం, నగదు పంపిణీ

సాక్షి, సిద్దిపేట: వలస కూలీలకు ప్రభుత్వం అండగా ఉంటోందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్, నంగునూరు మండలాల్లో ధాన్యం, శనగల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం సిద్దిపేటలో వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర నిర్మాణ పనులతోపాటు, పరిశ్రమలు, గృహ నిర్మాణాల కోసం కూలీలు మన రాష్ట్రానికి వచ్చారన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 వేలకు పైగా వలస కూలీలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వీరందరూ ప్రస్తుతం పనులు లేక, కుటుంబ పోషణ కూడా ఇబ్బందిగా మారిందని అన్నారు. వీరిని ఆదుకునేందుకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 చొప్పున నగదు అందజేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు ఇలా ప్రతీ ఒక్కరూ తమ దాతృత్వాన్ని చాటుకుంటూ కూలీలకు సహాయం అందజేస్తున్నారని అన్నారు. ఆహార పదార్థాలతో కూడిన కిట్స్‌ను అందజేసేందుకు వచ్చిన దాతలను మంత్రి అభినందించారు. అసత్యపు ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని మంత్రి ప్రజలను కోరారు.

ప్రతీ గింజను కొంటాం
గతంలో లేనివిధంగా ఈ ఏడాది గోదావరి, కృష్ణా జలాలు రాష్ట్రంలోని చెరువులకు మళ్లించామని, దీంతో ఎన్నడూ లేని విధంగా రబీ సాగు పెరిగిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌ డౌన్‌ మూలంగా తమ పంటలను ఎలా అమ్ముకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఎవరూ అధైర్య పడొద్దని, రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని మంత్రి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు