ఎమ్మెల్యేలకు చెక్కులిస్తాం: హరీష్‌రావు

8 Mar, 2020 14:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రూ.25 వేలలోపు రుణాన్ని తీసుకున్నవారికి ఈ ఆర్థిక ఏడాదే రుణమాఫీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వెల్లడించారు. ఆదివారం ఆయన 2020- –21 ఆర్థిక సంవత్సరానికిగానూ శాసనసభలో రూ.1.82 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా వాస్తవిక కోణంలో బడ్జెట్‌ రూపొందించినట్టు హరీష్‌ తెలిపారు. బడ్జెట్‌ సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... పాతికవేలలోపు రుణం ఉన్నవారికి ఈ ఆర్థిక ఏడాది రుణమాఫీ చేస్తామని.. అందుకోసం వచ్చే నెలలో ఎమ్మెల్యేలకు చెక్కులిస్తామన్నారు. (తెలంగాణ బడ్జెట్‌ 2020-21 హైలైట్స్‌)

మిగతా రుణాలను రాబోయే నాలుగేళ్ల ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బడ్జెట్‌పై గగ్గోలు పెడుతున్న ప్రతిపక్షాలు వాళ్లకు నచ్చినట్లు మాట్లాడుతారని విమర్శించారు. వాళ్లు చెప్పినట్లుగా అప్పుల విషయంలో ఇష్టం వచ్చినట్లు చేయడానికి అధికారాలు లేవని పేర్కొన్నారు. హరీష్‌ రావు బడ్జెట్‌ ప్రసంగం అనంతరం శాసనసభ బుధవారానికి వాయిదా పడింది.

(మార్చి 6 నుంచి బడ్జెట్‌ సమావేశాలు)

మరిన్ని వార్తలు