అమ్మా.. మీ సేవలు భేష్

8 Jul, 2020 05:25 IST|Sakshi

బాగా పని చేస్తున్నారు.. ఇంకా మెరుగైన సేవలందించండి  

ఆశావర్కర్లు, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తలను ఫోన్‌లో అభినందించిన హరీశ్‌ రావు

సాక్షి, సిద్దిపేట: ‘అమ్మా.. నేను హరీశ్‌రావును మాట్లాడుతున్నా.. కరోనా కష్టకాలంలో మీరు చేస్తున్న సేవలు అభినందనీయం.. మీ చేతుల్లోనే ప్రజల ఆరోగ్యం ఉంది.. ఇప్పటి వరకు బాగానే పనిచేస్తున్నారు.. ఇక ముందు కూడా మెరుగైన సేవలు అందించాలి’.. అని జిల్లాలోని ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లకు ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అభినందించారు. హైదరాబాద్‌ నుంచి మంత్రి సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని డంప్‌ యార్డులు, వైకుంఠధామాలు, హరితహారం మొదలైన కార్యక్రమాల అమలు తీరును తెలుసుకున్నారు.

జిల్లాలోని బక్రిచెప్యాల గ్రామం ఆశవర్కర్‌ శకుంతల, మిట్టపల్లి గ్రామ ఏఎన్‌ఎం శోభ, తడ్కపల్లి గ్రామం అంగన్‌వాడీ టీచర్‌ తిరుమలకు మంత్రి ఫోన్‌ చేసి మాట్లాడారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలంటే మహిళల్లో చైతన్యం రావాలని చెప్పారు. కరోనా వైరస్‌ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి మీరు సర్వే చేయడంతోనే కొంతమేరకు కరోనాను నివారించగలిగామని తెలిపారు. ఆహారానికి గంట ముందు, తిన్న తర్వాత తప్పనిసరిగా వేడి నీళ్లు తాగాలనే విషయం చెప్పాలని కోరారు. అలాగే.. ఆవిరి పట్టడం, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కాగా, మంత్రి నేరుగా ఫోన్‌ చేసి అభినందించడం పట్ల ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు సంతోషం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు