సంక్షేమ బాట వదిలేది లేదు

24 Sep, 2019 08:59 IST|Sakshi
గజ్వేల్‌లో మహిళలకు బతుకమ్మ చీరలను అందజేస్తున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, పక్కన జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ

ఆర్థిక మాంద్యం ఉన్నా.. కేంద్రం కోతలు విధించినా..

‘రైతుబంధు’కు పూర్తిగా డబ్బులు విడుదల చేస్తాం

రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలు 

గజ్వేల్, సిద్దిపేటలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ 

సాక్షి, గజ్వేల్‌/సిద్దిపేట : ఆర్థిక మాంద్యం కారణంగా చూపి కేంద్రం రాష్ట్రానికిచ్చే నిధుల్లో కోతల మీద కోతలు పెడుతున్నా... రాష్ట్ర బడ్జెట్‌ గతంతో పోలిస్తే లోటు ఏర్పడినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం సంక్షేమానికి నిధులు తగ్గించవద్దనే స్పష్టమైన వైఖరితో ఉన్నారని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, మర్కూక్‌ మండలాల మహిళలకు, సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల  మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు.  ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ పేదల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.  

పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన సంక్షేమ పథకాల నిధుల విడుదలలో ఢోకా ఉండదన్నారు.  ‘రైతుబంధు’కు సంబంధించిన డబ్బులు పూర్తిగా విడుదల చేస్తామన్నారు.  సీఎం  దూరదృష్టి కారణంగా రాష్ట్రంలో ‘మిషన్‌ భగీరథ’ పథకం పూర్తయి మంచి ఫలితాలనిస్తోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు టీఆర్‌ఎస్‌ పథకాలతో మనసున పడ్తలేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆదరణ కరువై కేసీఆర్‌ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. చెరువుల్లో నీళ్లు లేక బతుకమ్మను జరుపుకోవడం ఇదే చివరిదని... వచ్చే ఏడాది కాళేశ్వరం జలాలతో నిరంతరం కళకళలాడుతూ ఉంటాయని చెప్పారు.  

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సందర్భంలో మహిళల ముఖాల్లో వెలుగులు నింపడానికి చీరెల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు తెలిపారు. కాళేశ్వరం నీళ్లు వస్తే రైతుల జీవితాల్లో గొప్ప మార్పు రానుందన్నారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రోజారాధాకృష్ణశర్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళలపై అభిమానంతో ఏటా బతుకమ్మ సందర్భంగా చీరలు పంపిణీ చేయడం గొప్ప కార్యక్రమమని అభివర్ణించారు. పండుగ సందర్భంలో మహిళలకు కొత్త చీరలు ఆనందాన్నిస్తాయని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో  జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ భూపతిరెడ్డి, తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు డాక్టర్‌ యాదవరెడ్డి,  గాడిపల్లి భాస్కర్, ఎంపీపీ దాసరి అమరావతి,  పంగ మల్లేశం ఎంపీపీలు, జెడ్పీటీసీ, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు