నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే: హరీష్‌

19 Dec, 2018 12:57 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట :  ఎన్ని జన్మలెత్తినా సిద్దిపేట ప్రజల రుణం తీర్చుకోలేనిదని, తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని మాజీ మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. తన జన్మ ఉన్నంత వరకు ప్రజల కోసమే పని చేస్తానని హమీ ఇచ్చారు. బుధవారం సిద్దిపేటలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొదటి స్థానంలో లక్ష మెజారిటీతో గెలిపించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘనత సిద్దిపేట ప్రజలది, కార్యకర్తలదని అన్నారు.

‘ఎవరైనా మంచి నాయకుడు ఉన్నారనుకుంటారు, కానీ నాకు మంచి ప్రజలు దొరికారనిపిస్తుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిందన్నారు. ప్రజలు తమ మీద నమ్మకం ఉంచి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు అంతే నమ్మకంతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తన మీద అభిమానం ఉన్న వాళ్లు బొకేలు, శాలువాలు తేకుండా చెట్టును పెంచాలని సూచించారు. నాడు ఎన్నికల వల్ల ఆగిపోయిన బతుకమ్మ చీరలు ఇప్పుడు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 

బాబును తెలంగాణ ప్రజలు విశ్వసించలేరు
నిజామాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని తెలంగాణ ప్రజలు విశ్వసించలేరని, కాంగ్రెస్‌ పార్టీని సైతం తిరస్కరించారని మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లూరులో బతుకమ్మ చీరలు పంపీణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సంక్షేమ పథకాలకే ప్రజలు జై కొట్టారన్నారు. ప్రజలకు ఐదేళ్లు సేవ చేసుకుంటామని, రైతు బంధు పథకం ద్వారా రైతులకు 10 వేలు అందిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు