'నా కళ్లలో వెయ్యి ఓల్టేజీల కాంతి నింపింది'

5 Feb, 2020 20:30 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట: లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున మంజూరైన వివిధ వాహనాలను ఆర్థికశాఖ మంత్రి హరీష్‌ రావు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్‌ గ్రామం చింతమడకలో ప్రజల ఆర్థిక అభివృద్ధికి వాహనాలు, గేదెలు, కోళ్ల ఫామ్‌, హార్వెస్టార్‌, జేసీబీ, మినీ గూడ్స్‌ లాంటి ఇతర వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'సీఎం కేసీఆర్‌ స్వగ్రామం చింతమడక, మాచాపూర్‌, సీతారాం పల్లి గ్రామాల ప్రజలకు వాహనాలను పంపిణీ చేయడం నా కళ్లలో వెయ్యి ఓల్టేజీల కాంతి నింపిందని అన్నారు. వాహనాలను భద్రంగా చూసుకుంటూ.. అప్పులు తీర్చుకొని ఓనర్లుగా మారాలని వారిలో స్ఫూర్తి నింపారు.

మద్యం సేవించి వాహనాలు నడపకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. రాబోయే రోజుల్లో మీరే ఇతరులకు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. అప్పుడే మనం కేసీఆర్‌కు గిఫ్ట్‌ ఇచ్చిన వారమవుతామని అన్నారు. సీఎం మనకు అప్పగించిన వాటిని నమ్మకంతో ఉపయోగించుకొని ముందుకు వెళ్దామన్నారు. త్వరలో చింతమడకలో పాలశీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. గ్రామంలో రూ. 2.50 కోట్ల నిధులతో శివాలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. మీరు కోరుకున్న రంగాల్లో మీకు అవకాశాలు కల్పిస్తామని.. అందివచ్చిన అవకాశాన్ని అందరూ వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు దక్కుతాయని ఎవరూ అదైర్యపడొద్దని సూచించారు. 

మరిన్ని వార్తలు